అలరించిన బుర్రకథా గానం

2 Aug, 2016 22:19 IST|Sakshi
అలరించిన బుర్రకథా గానం
రాజమహేంద్రవరం కల్చరల్‌ : 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందు ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నగరంలోని పుష్కరాల రేవు, రాజరాజనరేంద్రుని విగ్రహం వద్ద మంగళవారం ప్రదర్శించిన శ్రీనివాస కల్యాణం బుర్రకథ అలరించింది. ప్రముఖ బుర్రకథ కళాకారులు గొర్రెల రామం బృందం  ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించారు. కథకుడు గొర్రెల కృష్ణ సతీసుమతి కథను కూడా రసవత్తరంగా వివరించారు. గొర్రెల రామం, గొర్రెల శ్రీనివాస్‌ వంతులుగా ప్రదర్శనను రక్తి కట్టించారు. కాగా వర్షాకాలమని తెలిసీ, ప్రేక్షకులకు నడిరోడ్డుపై ‘నిలబడి’ ప్రదర్శనను చూసే మహత్తర ‘అవకాశం’కల్పించడంలో నగరపాలకసంస్థ ఉద్దేశం ఏమిటో పెరుమాళ్లకే ఎరుక. కేవలం ముగ్గురు, నలుగురు ప్రేక్షకులు వేదికపైనే ఓపక్కగా కూర్చుని ప్రదర్శనను తిలకించారు. టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తున్నారు.కళాకారులకు ప్రత్యేకంగా వేదిక నిర్మించినా, ప్రేక్షకులు నడిరోడ్డుపై నిలబడి ప్రదర్శనను చూడవలసిందే. సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆనం కళా కేంద్రంలో జరుగుతున్న నేపధ్యంలో, టీటీడీ కార్యక్రమాలను కూడా అక్కడే నిర్వహిస్తే, కళాభిమానులు మరికొందరు ఈ కార్యక్రమాలను వీక్షించే అవకాశం ఉంటుంది.
 
మరిన్ని వార్తలు