చిరంజీవి ప్రశంసలతో చెమటలు పట్టాయి..

29 Oct, 2015 14:48 IST|Sakshi
చిరంజీవి ప్రశంసలతో చెమటలు పట్టాయి..

 ‘ఏ కులమూ తక్కువ కాదురా
 కులమంటే పని.. కమతాన్ని నమ్ముకున్నోడు కమ్మోడయ్యాడు
 కాపు కాసేవాడు కాపోడయ్యాడు
 కుమ్మరోడి కుండ, చాకలోడి బండ
 కంసాలి సేత, సాలీల నేత...
 ఏదీ వాళ్లు బతకటానిక్కాదు
 అందరినీ బతికించటానికి...
 నువ్వెవరంటే ఏం చేస్తుంటావని...నీ నెత్తురేంటీ అని కాదు.
 అలా అడిగేవాడు అసలు మనిషే కాడు...’

 
కులాల సరిహద్దులు గీసుకుని కూపస్థ మండూకాల్లా జీవిస్తున్న దురహంకారులకు చెంపపెట్టులాంటి ఈ డైలాగ్ ‘కంచె’ థియేటర్లో పేలుతోంది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్‌తేజ, ప్రగ్యాజైస్వాల్ జంటగా దసరాకు విడుదలైన సినిమా మూసచిత్రాలకు భిన్నంగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తీసింది. ఈ చిత్రానికి సంభాషణలు సాయిమాధవ్ బుర్రా. ఇదేరోజు విడుదలైన హారర్ కామెడీ సినిమా ‘రాజుగారి గది’ సినిమాకూ సంభాషణలు తనవే. కంచె విజయయాత్రలో భాగంగా బుధవారం హీరో హీరోయిన్లతోపాటు తెనాలి వచ్చిన సాయిమాధవ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించిన అంశాలు ఆయన మాటల్లోనే...  
        
 
నేను సంభాషణలు సమకూర్చిన సినిమాలు ఒక్కోటీ ఒక్కో జానర్ కావటం, ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందటం హ్యాపీగా ఉంది. ఇలాంటిరోజు రావాలనుకొన్నాను..వస్తుందనుకోలేదు. కృష్ణం వందే జగద్గురుమ్, గోపాల గోపాల, మళ్లీమళ్లీ ఇది రానిరోజు, దొంగాట, ఇప్పుడు కంచె, రాజుగారి గది సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేని కథలు,
 
కంచె సినిమా కథను దర్శకుడు క్రిష్ ఎప్పుడైతే చెప్పారో? ఆ కథ వింటున్నపుడే అలౌకికమైన అనుభూతికి లోనయ్యాను. అర్థగంటసేపు మాటల్లేవు. కథ విన్నపుడు నేను ఎలాంటి ఫీలింగ్స్‌కు లోనయ్యానో, ఇప్పుడు సినిమా చూస్తున్న ప్రేక్షకులు అదే ఫీల్‌తో బయటకొస్తున్నారు. అద్భుతమైన ప్రేమ, సభ్యత, సంస్కారం, గతం, మన ఉనికి...ఒక డైలాగ్ రైటర్‌గా నన్ను ప్రూవ్ చేసుకొనే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.

రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని, ఆ కాలయానంలో మనుష్యుల మధ్య ఉన్న అంతరాలను అనుసంధానం చేస్తూ ఒక చక్కని కథ, ఆ రెండూ నేపథ్యాలను సమాంతరంగా నడిపిస్తూ పొందికైన కథనం ‘కంచె’లో కుదిరాయి. నా డైలాగులంటారా? సోషల్ మీడియాలో జోరుగా సర్కులేట్ అవుతున్నాయి. క్లాస్, మాస్ ఆదరిస్తున్నారు.
 
మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పిలిపించుకొని సినిమాలోని డైలాగులు ఆయన నోటివెంట చెబుతుంటే స్టన్నయిపోయాను. ఆయన ప్రశంసిస్తుంటే నాకు చెమటలు పట్టాయి. ఆయన్ను ట్రెండ్ సెట్టర్ అనేకంటే ఒక కల్ట్ సృష్టించారాయన. ఆయన సినిమాకు మాటలు రాసే అదృష్టం ఉండదేమోనన్న నిరాశలో ఉన్న నాకు, కంచెలోని పదునైన సంభాషణలు ఆయన చెబుతుండటం మధురమైన అనుభూతి.

అలాగే ఎక్కడెక్కడ్నుంచో ప్రేక్షకులు ఫోను చేసి ఆర్ద్రతతో అభినందిస్తున్నారు. ఇంత గొప్ప కథ, కథనానికి ఏ రచయితయినా ప్రాణం పెట్టి రాస్తాడు. ఆ అవకాశం నాకు రావటానికి కారణం  క్రిష్‌కు నాపై గల నమ్మకం. రొటీన్ ఫార్ములా సినిమాల కాలంలో ఇలాంటి సినిమా కెరీర్లో ఒకసారి రావటమే గొప్ప.
 
తెనాలి నాకిచ్చిన జ్ఞానం నాకు ఉపయోగపడింది. ఇక్కడ్నుంచే ప్రపంచాన్ని తెలుసుకొన్నా. రచయితగా బతుకు, చావు రెండూ సినీపరిశ్రమలోనేనని ఏనాడో నిశ్చయించుకొన్నా. ఆ దారిలో నన్ను నడిపించింది తెనాలి. దర్శకుడు క్రిష్ లేకుంటే నేను లేను. తల్లి రుణం, ప్రేక్షకుల రుణం, తెనాలి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఈ గడ్డమీదనే మళ్లీ మళ్లీ జన్మించాలని నా ఆశ.
 
ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘం బ్యాక్‌గ్రౌండ్ ఉండటం నాకు ఉపయోగపడింది. చదివిన పుస్తకాలు, బొల్లిముంత శివరామకృష్ణ సాంగత్యం దోహదపడ్డాయి.  చాలా ఏళ్లక్రితం కథ రాసి, ప్రఖ్యాత మాటల రచయిత బొల్లిముంత శివరామకృష్ణకు చూపించా. కథలాగ లేదుకానీ, రాస్తూ ఉండు ఎప్పటికయినా కథవుతుంది అన్నారాయన. ఆయన మాట పట్టుకొని రాసుకుంటూ వెళ్లా...ఇప్పుడు ఒక దారికొచ్చాను. ఆయన బాటలో ప్రస్తుతం అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నా.

మరిన్ని వార్తలు