ఫ్లయిట్ ఛార్జీలను మించి బస్సు ఛార్జీలు

12 Jan, 2016 11:36 IST|Sakshi
ఫ్లయిట్ ఛార్జీలను మించి బస్సు ఛార్జీలు

హైదరాబాద్: జనాల కంటే సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే ప్రైవేటు ట్రావెల్స్‌కు నిజమైన పండుగే. ఏటా ఈ సీజన్‌లో ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లను 50శాతానికి పైగా పెంచేసి కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. సంక్రాంతి పేరుతో ప్రయాణీకులను అడ్డంగా దోచేస్తున్నారు. 

పండుగ పూట అయినవారితో గడుపుదామని పల్లె బాట పట్టిన జనాల  జేబులు గుల్ల చేస్తున్నారు.  విమాన ధరలకు ఏమాత్రం తీసిపోనట్లుగా బస్సు ఛార్జీలను అమాంతం పెంచేయడంతో ప్రయాణికులపై భారం పడుతోంది. అటు ఆర్టీసీ కూడా ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు.  ప్రభుత్వం కళ్లుమూసుకుని కూర్చోవడంతో ప్రయాణీకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో అధిక ధరలకు టికెట్లు కొనాల్సి వస్తోంది.

హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్లాలంటే 3 వేల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు.  వైజాగ్‌ వెళ్లాలంటే కూడా అంతే చెల్లించాల్సి వస్తోంది. ఇక రాజమండ్రికి 2వేలు, భీమవరానికి 1600, ఏలూరుకు 2వేలు వసూలు చేస్తున్నారు. పండగ వేళ ప్రయివేట్ ఆపరేటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఏపీ సర్కారు చోద్యం చూస్తోంది. బస్సు ఛార్జీలు రెట్టింపు అయినప్పటికీ నియంత్రణపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఇప్పటివరకు అధికారులతో సమావేశం కూడా నిర్వహించలేదు. బస్సుల తనిఖీలకు దిగిన పాపాన పోలేదు.  ఈ నేపథ్యంలో ఎటువంటి దారిలేక.. దిక్కుతోచక ప్రయాణికులు అధిక ధరలు చెల్లిస్తున్నారు.

ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి...
 హైదరాబాద్ నుంచి విజయనగరం ఛార్జీ రూ.3వేలు. నాన్ ఏసీ బస్సుకు రూ.1300
 హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలంటే గరిష్టంగా రూ.3వేలు. నాన్ ఏసీ బస్సుకు రూ. 1700
 హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.2వేలు
 హైదరాబాద్ నుంచి భీమవరానికి ఛార్జీ రూ.1600
 హైదరాబాద్ నుంచి ఏలూరుకు ఛార్జీ రూ.2వేలు
 హైదరాబాద్ నుంచి అమలాపురం ఛార్జీ రూ.వేలు

మరిన్ని వార్తలు