అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా

2 Jun, 2016 23:24 IST|Sakshi
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా

డ్రైవర్, కండక్టర్ సహా 15 మందికి గాయాలు
రాయిలాపూర్ గేటు వద్ద ఘటన
డ్రైవర్ నిర్లక్ష్యమేనంటున్న పోలీసులు

కౌడిపల్లి: అదుపు తప్పడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్, కండక్టర్ సహా 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కౌడిలిపల్లి మండలం రాయిలాపూర్ గేట్ సమీపంలో మెదక్-నర్సాపూర్ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం..

 మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (నం: టీఎస్ 15జెడ్ 0116) గురువారం ఉదయం మెదక్ నుంచి జేబీఎస్‌కు వెళ్తుంది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయిలాపూర్ గేట్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. రాయిలాపూర్ గేట్ వద్ద ప్రయాణికులు లేకపోవడంతో ఆగకుండా వెళ్లింది. సమీపంలో రోడ్డుపైబైక్‌లు ఆపుకుని నలుగురు వ్యక్తులు ఉండటంతో వారిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా అదుపుతప్పిన బస్సు రోడ్డు కుడివైపునకు దూసుకెళ్లింది.

అక్కడే గ్రామానికి మంచినీటిని సరఫరాచేసే బోరుమోటార్‌ను ఢీకొని సమీపంలోని మామిడి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సంగమేశ్వర్ (మెదక్), కండక్టర్ అనిత (గౌతాపూర్)తోపాటు ప్రయాణికులు గూడ లక్ష్మి(మెదక్), కౌ డిపల్లి అంతయ్య (కొడిపాక), సాలె నర్సింలు (దేవులపల్లి), సాదుల లక్ష్మీనర్సమ్మ (కిష్టాపూర్), రమ, బద్రి కావ్య, వీరరాజు (సరూర్‌నగర్), బానూబీ (మెదక్), సఫబేగం, షేక్‌అలీ (నర్సాపూర్), జలాల్‌పూర్ సుధాకర్ (కౌడిపల్లి), ర్యాగ ల్ల శ్రీకాంత్ (కొల్చారం), నరహరి (ధర్మాసాగర్) గాయపడ్డారు. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తనసిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆటోలో నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు.

 స్థానికుల సహాయక చర్యలు...
బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు ఆర్తనాదాలతో మిన్నంటాయి. బస్టాండ్ వద్ద ఉన్న కాజిపేటకు చెందిన జహంగీర్‌తోపాటు రాయిలాపూర్ వాసులు బస్సు అద్దాలను ధ్వంసం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు.  వారిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన వారిని వేరు బస్సులో తరలించారు. డ్రైవర్ సంగమేశ్వర్‌ను నర్సాపూర్‌లో ప్రథమ చికిత్స అనంతరం బంధువులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్ ఆసుపత్రి వైద్యులు బాధితులకు చికిత్సలు నిర్వహించారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే బస్సు బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

 డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం...
బస్ బోల్తా పడటంతో డ్రైవర్ సంగమేశ్వర్‌గౌడ్‌కు గాయాలతో తప్పించుకున్నారు. బస్సు బోరు బావిని ఢీకొనడంతో బోల్తా పడ్డ ప్రదేశంలో బోరుబావిలోని పైప్ డ్రైవర్ సీటుకు పక్కనే తేలింది. కొద్దిలో డ్రైవర్ తలకు తగిలే ప్రమాదం ఉండేదని పలువురు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు.

మరిన్ని వార్తలు