మార్కెట్‌ కళకళ

13 Jan, 2017 01:13 IST|Sakshi
మార్కెట్‌ కళకళ

జిల్లాలో రోజుకు రూ.200 కోట్ల వ్యాపారం
 రెడీమేడ్‌ డ్రస్సులు, కిరాణా సరుకుల కొనుగోళ్లే అధికం
ఆఫర్లతో ఆకట్టుకుంటున్న వ్యాపారులు
 తిరుపతిలో ఎటు చూసినా పండుగ సందడే


పట్టణాల్లో పండుగ సందడి మొదలైంది. రెడీమెడ్‌ డ్రస్సులు, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, కిరాణా సరుకుల కొనుగోళ్లతో మార్కెట్‌ కళకళలాడుతోంది. హిందువులు సంప్రదాయంగా జరుపుకునే పెద్ద పండుగ కావడంతో అన్ని రకాల వస్తువుల క్రయవిక్రయాలు కోట్లల్లో జరుగుతున్నాయి. వ్యాపార వర్గాల అంచనా ప్రకారం జ్యువెలరీ క్రయ విక్రయాలతో కలిపి రోజుకు రూ.200 కోట్ల మేర బిజినెస్‌ జరుగుతోంది.

 తిరుపతి :
జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పీలేరు, పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి పట్టణాల్లో పండుగ కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచే ఈ కొనుగోళ్లు మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ అంటేనే కొత్త బట్టలు, పిండివంటలు. దీంతో ఆయా దుకాణాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లే తిరుపతి నగరంలో రోజుకు సగటున రూ.వంద కోట్ల వ్యాపారం జరుగుతోంది.  పిండివంటల సరుకులు పెద్ద మొత్తంలో అమ్ముడుపోతున్నాయి. రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. దుకాణాలతో పాటు తోపుడు బండ్లపై కూడా వ్యాపారం ఊపందుకుంది. వారం రోజుల నుంచి తిరుపతిలోని గాంధీరోడ్డు, తీర్థకట్టవీధి కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చిత్తూరు, శ్రీకాళహస్తిల్లోనూ పండుగ కొనుగోళ్లు ఆశాజనకంగానే ఉన్నాయి. నోట్ల రద్దు ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన మేర సరుకుల కొనుగోళ్లు ఉండబోవని తీవ్రంగా కంగారు పడ్డ వ్యాపారులు పెద్దఎత్తున జరుగుతున్న కొనుగోళ్లను చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు.

బంగారం కొనుగోళ్లు కూడా..
సంక్రాంతి సందర్భంగా బంగారు ఆభరణాల కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. రోజుకు సగటున 80 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా.  జిల్లావ్యాప్తంగా పదో తేదీ తరువాత రూ.150 కోట్ల నగదును ఏటీఎంలకు కేటాయించినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజలకు నోట్ల కష్టాలు తగ్గినట్లే కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు