783 ఎకరాల భూమి కొనుగోలు

29 Jun, 2016 08:27 IST|Sakshi
783 ఎకరాల భూమి కొనుగోలు

దళితులకు మూడెకరాల భూ పథకం కోసం..
మార్కెట్ ధరకు అనుగుణంగా ధర
రైతుల ఖాతాలకే నేరుగా డబ్బు జమ
కలెక్టర్ యోగితారాణా వెల్లడి

 బోధన్: దళితులకు మూడెకరాల భూ పంపిణీ కోసం ఇప్పటివరకు 783 ఎకరాల పట్టా భూములు కొనుగోలు చేసినట్లు కలెక్టర్ యోగితారాణా తెలిపారు. రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న పట్టా భూములకు సంబంధించిన డబ్బును నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని, మధ్యవర్తులకు ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల పంపిణీ కోసం బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 30 గ్రామాలకు చెందిన 176 మంది రైతులు తమ 447 ఎకరాలు విక్రయించేందుకు ముందుకు వచ్చారు.

 ఆయా రైతులతో కలెక్టర్ మంగళవారం ఆర్డీవో ఆఫీస్‌లో విడివిడిగా చర్చించారు. అంతకు ముందు పట్టా భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు, నక్షా, భూముల స్థితిగతులను పరిశీలించారు. వర్షాధార మెట్ట, చెరువులు, బోరుబావులు కలిగి నీటి వసతి ఉన్న భూములు, వాణిజ్య పంటలు, ఆరుతడి పంటలు సాగయ్యే భూముల వివరాలను రైతులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 రైతులు ప్రతిపాదిస్తున్న ధరలను తెలుసుకున్న కలెక్టర్.. మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని ఎకరాకు రూ.3.50 లక్షల నుంచి రూ.5.75 లక్షల వరకు ధర నిర్ధారించనున్నట్లు చెప్పారు. దళితులకు మూడు ఎకరాల సాగు యోగ్యమైన భూమిని అందించాలనే ప్రభుత్వం లక్ష్యం మేరకు భూమి కొనుగోలు పథకం కింద 2016-17 సంవత్సరానికి గాను 783 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేశామన్నారు. రెండు నెలల కాలంలోనే ఈ భూమిని సేకరించినట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డెరైక్టర్ విమలాదేవి, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు