చిల్లర కొనాల్సిందే!

26 Jul, 2016 15:26 IST|Sakshi
చిల్లర కొనాల్సిందే!
  • రూ.10 కమిషన్‌తో రూ.100 చిల్లర కొనుగోలు
  • జిల్లాలో నిత్యం రూ.లక్షల్లో నష్టపోతున్న వినియోగదారులు
  • వెండింగ్‌ బాక్స్‌ల ఏర్పాటులో బ్యాంకుల చొరవ కరవు
  • ఆర్‌బీఐ ఇస్తున్న చిల్లర ఎటుపోతుందో తెలియని పరిస్థితి
  • జోగిపేట: చిల్లర అంటే.. చిన్న విషయం కాదు. వర్తకులు, ఇతర వ్యాపారవేత్తలకు వాటి విలువ తెలుసు. నిత్యం సగటున ప్రతి వినియోగదారుడు జరిపే కొనుగోలులో కనీసం పది పైసలు మొదలు రెండు రూపాయల వరకు చిల్లర నష్టపోతుంటాడు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా చిల్లర సమస్య వేధించడమే అసలు సమస్య. ఇంతలా సమస్య ఎం దుకు వచ్చిందో తెలుసుకోవాల్సిందే...

    చిల్లర కొనాల్సిందే! పైసలను పైసలు పెట్టి కొనడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అవును ప్రస్తుతం చిల్లర పైసల కొరత ఏర్పడటం.. దాన్ని ఆసరాగా తీసుకునే చిరు వ్యాపారులు రోజు కు వేల రూపాయల చిల్లరను హోటళ్లు, పెద్ద కిరాణం, వ్యాపార సంస్థలకు కమిషన్‌
    పై అందజేస్తున్నారు.

    రూ.100కు రూ.10 చొప్పున కమిషన్‌పై వేల రూపాయల చిల్లరను అందజేసి వేలు సంపాదిస్తున్నారు. పేరుకి చిల్లరగా భావిస్తున్నా డబ్బు నుంచి డబ్బును సంపాదించడం తెలిసినవారికి అది లాభాల పంట పండిస్తోంది. ఏ మాత్రం నష్టభయం లేని నిశ్చింత వ్యాపారాల్లో ఇదొకటి. జిల్లాలోని ప్రతి వ్యక్తి చిల్లర సమస్యను ఎదుర్కొంటున్న వారే.

    చిల్లరను ఎవరు ఉంచుకోవాలి?
    చిల్లరను ఎవరు ఉంచుకోవాలన్నది వివాదస్పదంగా మారింది. వినియోగదారుడు సరిపడా చిల్లరను ఇచ్చి సేవలు పొందాలని అమ్మకందారుడు అంటుంటే.. అమ్మకందారుడే విధిగా అందించాల్సి ఉంటుందని వినియోగదారుడు భావిస్తున్నాడు. చివరకు చిల్లర కోసం అనవసర కొనుగోలు తప్పడం లేదు. సరిపడా లేక అదనపు కొనుగోళ్లు చేయాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో డిమాండ్‌ లేని ఇతర వస్తువులను కొందరు వ్యాపారులు అంటగట్టడం పరిపాటిగా మారింది.

    ఆర్‌బీఐ ఇస్తుందంతా ఏమవుతోంది?
    రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) విపణిలో చిల్లర అందుబాటులో ఉంచేలా ఆయా బ్యాంకులకు అందజేస్తుంది. ఆ మొత్తాలను అందుబాటులో తేవాల్సిన బాధ్యత బ్యాంకర్లపైనే ఉంటున్నా.. వాస్తవ పరిస్థితుల్లో జిల్లాలో చిల్లర మిషన్ల ఏర్పాటు ఎక్కువగా కనిపించడం లేదు. మరి ఆర్‌బీఐ ఇస్తున్నదంతా ఎక్కడకు పోతుందనే విషయానికి సమాధానలు లేకున్నా.. చిల్లరను వ్యాపారుల పరం చేస్తూ సాధారణ జీవులకు అందుబాటులో లేకుండా  చేసే దళారీ వ్యవస్థ బలంగా వేళ్లూనుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    వెండింగ్‌(చిల్లర) మిషన్ల ఏర్పాటులో ప్రోత్సాహమేదీ?
    సుమారు లక్ష జనాభా ఉన్న చోట వెండింగ్‌ మిషన్‌ అందుబాటులో ఉంచాలని ఆర్‌డీఐ ఆదేశాలు చెబుతున్నాయి. జిల్లాలో బ్యాంకర్లు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఉన్నాయని చెబుతున్నా జిల్లాలో అవి ఎక్కడ ఉన్నాయో అనే విషయాన్ని ఆయా బ్యాంకుల సిబ్బందే చెప్పలేక పోవడం గమనార్హం.

    50 పైసలు దాటితేనే ...
    వ్యాపార లావాదేవీల్లో 50 పైసలు దాటితేనే రూపాయి తీసుకోవాల్సి ఉంది. అంతేకాక 50 పైసల్లోపు ఉంటే దానికి ముందు ఉన్న మొత్తాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అమ్మకందారులు పైసా దాటినా రూపాయి వసూలు చేస్తున్నారు. వీటిని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇష్టారీతిన చిల్లరను నొక్కేస్తున్నారు. జిల్లాలోని పెట్రోలు బంకుల్లో ‘చిల్లర’ వ్యత్యాసంలో రోజుకు సుమారు లక్షలు మిగులుతాయని ప్రైవేట్‌ బ్యాం కులు సర్వే చేసినట్లు చెబుతున్నారు.

    ఆర్‌బీఐ నుంచి రావడంలేదు
    రెండేళ్లుగా ఆర్‌బీఐ నుంచి మా బ్యాంకుకు చిల్లర రావడంలేదు. గతంలో రాగానే వ్యాపారస్తులకు ఇచ్చేవాళ్లం. చిల్లర డబ్బుల సమస్య ఉన్నట్లు వ్యాపారస్తుల ద్వారా తెలుసుకున్నాం. కాయిన్‌ వెండర్స్‌ మిషన్‌మా బ్యాంకులో ఉన్నా పనిచేయడం లేదు.
    – మారుతి కుమార్, ఎస్‌బీహెచ్‌ మేనేజర్, జోగిపేట

    చిల్లర కొనుక్కుంటున్నాం
    మా హోటల్‌ వ్యాపారానికి చిల్లర తప్పనిసరి. కాబట్టి చిల్లరను వందకు పది రూపాయల చొప్పున ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఒక్కోసారి కమిషన్‌ మీద తీసుకోవాలనుకున్నా దొరకడం లేదు. ఒకేసారి రూ.5 వేలు, రూ.10 వేల వరకు చిల్లరను తీసుకుంటున్నాం. – సురేశ్, హోటల్‌ యజమాని, జోగిపేట

>
మరిన్ని వార్తలు