ఇప్పట్లో వరంగల్ ఉప ఎన్నిక లేనట్లే!

9 Sep, 2015 16:40 IST|Sakshi
ఇప్పట్లో వరంగల్ ఉప ఎన్నిక లేనట్లే!

హైదరాబాద్: ఖాళీగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక జరిగే పరిస్థితులు కనిపించడం లేదు.  వరంగల్ పార్లమెంట్ స్థానానికి వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తొలుత భావించినా..  దీనిపై ఎన్నికల ప్రధాన కమిషన్ ఎటువంటి ప్రకటన చేయలేదు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రధాన కమిషర్ నసీం జైదీ బుధవారం విడుదల చేశారు.  కాగా, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఎటువంటి షెడ్యూల్ ను విడుదల చేయకపోవడంతో.. ఆ ఎన్నిక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చలు మొదలైనా..  నోటిఫికేషన్ రాకపోవడంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాన్ని రచించుకోవడానికి మరికాస్త సమయం  దక్కిందనే చెప్పవచ్చు.


సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి పదవిని స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జూలై 21న ఆయన రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలపడంతో వరంగల్ ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల చట్టం ప్రకారం సీటు ఖాళీ అయినప్పటి నుంచీ ఆరు నెలల వ్యవధిలో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు