అక్కడ‌ అ అంటే అవినీతి

23 Jul, 2016 23:26 IST|Sakshi
ఇటు పాయకరావుపేట.. అటు తుని.. మధ్యలో తాండవ వంతెన. జిల్లాలు వేరైనా.. దాన్నే వారధిగా చేసుకుని ఈ రెండూ సామాజికంగా, సాంస్కతికంగా జంట పట్టణాలుగా అనుబంధాన్ని పెనవేసుకున్నాయి. ఆ అనుబంధం అక్కడితో ఆగలేదు.. రెండు నియోజకవర్గాలస్థాయికి విస్తరించింది.. పెడదారి పట్టింది. మునుపెన్నడూ లేని విధంగా గత రెండేళ్లలో అవినీతి, అక్రమాలు జంట నియోజకవర్గాలను అక్టోపస్‌లా కబళించాయి. అధికార దన్నుతో అడ్డగోలు వసూళ్లు, ఇసుక దోపిడీ,  భూ దందాలు, దురాక్రమణలు, మద్యం షాపుల నుంచి నెలవారీ మామూళ్లు, సెటిల్‌మెంట్లు, ఇష్టారాజ్యంగా ప్రభుత్వోద్యోగుల బదిలీలు.. అబ్బో.. ఇంకా చెప్పాలంటే.. ప్రతి పనిలోనూ కాసుల వేటతో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. 
సరే.. తూర్పుగోదావరి జిల్లా తునిలో అవినీతి తుట్టె గురించి మనకెందుకు గానీ.. మన విశాఖ జిల్లా పాయకరావుపేటలో రెండేళ్లుగా ఏం జరుగుతుందో చూస్తే.. ఎవరికైనా మైండ్‌ బ్లాక్‌ అయిపోతుంది. అర్ధంతరంగా అందిన అధికారం, నడమంత్రపు సిరి, దానికితోడు తలబిరుసుతో చెలరేగిపోతున్న ఓ పచ్చ నేత పైత్యం ఇప్పుడు  చర్చనీయాంశమవుతోంది. 
మనం చిన్నప్పుడు అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అని చదువుకున్నాం. కానీ అక్కడ మాత్రం ఇప్పుడు అ అంటే అవినీతి,. ఆ అంటే ఆనకట్ట లేని అక్రమాలు అంటూ కొత్త నిర్వచనాలు చెబుతున్నారు. అ.. ఆ..లకు వారెలా కొత్తగా నిర్వచించారో.. ఈ వారం విశాఖ తీరంలో తెలుసకుందాం.. రండి..
                                                                          –జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
 పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన దరిమిలా ఆ పదేళ్ల ఆకలిని తీర్చుకునేందుకు ఈ రెండేళ్ల కాలంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అందినకాడికి ఆబగా దోచేశారు. ప్రతి పనిలోనూ కాసులు వెతుక్కుంటూ రూ.కోట్లు కూడగట్టేశారు. పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ నాయకులకు ఇందులో మినహాయింపేమీ లేదు. అయితే ప్రత్యేకించి ఓ టీడీపీ నేత వ్యవహారశైలి మాత్రం ఆ పార్టీ శ్రేణులకే మింగుడుపడటం లేదు. అడ్డగోలుగా రూ.కోట్లు కూడగడుతూనే అధికారులను, ఉద్యోగులను, పార్టీ కార్యకర్తలను ఏ మాత్రం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న తీరు అందరికీ ఏవగింపు కలిగిస్తోంది. మండలాలు, గ్రామాల వారీగా దళారులను ఏర్పాటు చేసుకుని దందాలు చేయడం సదరు నేత ప్రత్యేకత. చిన్న పనికి కూడా రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతుంటారు. ఉద్యోగుల బదిలీలు మొదలుకొని అంగన్‌వాడీ కార్యకర్తలు, చివరికి ఆయాల నియామకాలకూ డబ్బులు ముట్టజ్పెపాల్సిందే.
–ఎస్‌.రాయవరం మండలంలో ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తలు సదరు నేత పుట్టిన రోజు పురస్కరించుకుని తలో కొంత వేసుకుని బంగారం కొనుగోలు చేసి గిప్ట్‌గా ఇచ్చారు. అంతే.. అప్పటివరకు వేధింపులతో అల్లాడిపోయిన వారికి గిప్ట్‌ ఇచ్చిన తర్వాత ఒకింత ఉపశమనం లభించింది.
– మద్యం షాపులవారు ఎంతో కొంత ఇవ్వాల్సిందేనన్న ఆ నేత ఒత్తిళ్లకు ఇటీవలే వ్యాపారులు తలొగ్గారు. గత నెల తలో యాభై వేల పోగేసి మొత్తం రూ.16 లక్షలు సమర్పించుకున్నారని అంటున్నారు. ఇలా ప్రతి నెలా ఇవ్వాలంటే మాత్రం సాధ్యం కాదని తెగేసి చెప్పేశారు. అయితే ఎంతోకొంత ఇవ్వకుంటే అధికారం తలకెక్కిన ఆ నేత పగబట్టి ఏం చేస్తారోనన్న ఆందోళన కూడా మద్యం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. అందుకే మద్యం సిండికేట్లు ఎంఆర్‌పీని పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన ధరలకు మద్యం విక్రయాలు చేసేస్తున్నారు. గ్రామాల్లో బెల్టుషాపులూ రెట్టింపయ్యాయి.
ఇసకాసుర అవతారం
తాండవ, వరహా నదులను చెర పట్టిస్తూ అడ్డగోలుగా చేస్తున్న ఇసుక దోపిడీ ఆయా ప్రాంతాల్లో పరాకాష్టకు చేరింది. పందూరు ఇసుక రీచ్‌ను గ్రామస్తులు వేలం పాడుకుంటే వారి నుంచి రూ.3 లక్షలు, గొట్టివాడ రీచ్‌ నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎయిర్‌‡పోర్టు, అచ్యుతాపురం ప్రాంతాలకు ఇసుక తరలింపు విషయంలోనూ భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ నేత అండదండలతోనే నిత్యం ఈ రెండు నదుల్లో వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోందనేది అక్కడ బహిరంగ రహస్యం. ఇసుక దోపిడీ విషయంలో టీడీపీకే చెందిన తుని నాయకుడితో సదరు నేతకు చాన్నాళ్లు విభేదాలు నడిచాయి. ఎట్టకేలకు ఇటీవల ఇరు జిల్లాల పార్టీ పెద్దలు రాజీ కుదిర్చిన నేపథ్యంలో వివాదాలు లేకుండా ఎవరికి అందినంత వారు దోచేసుకుంటున్నారు.
ప్రతి పనికీ ఓ లెక్కుంది.. దానికో రేటుంది
జాబు రావాలంటే బాబు రావాల్సిందే.. ఎన్నికల ముందు ఇదే టీడీపీ నినాదం. కానీ పాయకరావుపేటలో ఇప్పుడు ఆ నినాదం.. ‘జాబు రావాలంటే  జేబు నిండాల్సిందే’ అన్నట్లు మారిపోయింది. కె.వెంకటాపురం, పాములవాక, కోటవురట్లలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో టీచర్ల పోస్టులకు రూ.30 వేలు చొప్పున డిమాండ్‌ చేశారన్న వాదనలు ఉన్నాయి. నీరు చెట్టు పథకం ద్వారా నియోజకవర్గానికి మంజూరైన కోట్లాది రూపాయల నిధుల్లో కమీషన్లు ఇవ్వాలంటూ అదే పనిగా అధికారులు, కాంట్రాక్టర్ల వెంట పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పధకం ద్వారా మంజూరైన పనులను కమీషన్లు ఇచ్చినవారికే కేటాయించారని చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయం నుంచి నెలవారీ మామూళ్లు ఇవ్వనందుకు.. పైగా ఈ విషయం బయట ప్రచారం చేసినందుకు ఓ తహశీల్దార్, పలువురు వీఆర్వోలు అర్ధంతరంగా బదిలీ అయ్యారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ఎన్నాళ్లుగానో నియోజకవర్గంలోనే పాతుకుపోయిన ఓ డిఫ్యూటీ తహశీల్దార్‌ నుంచి రెండు లక్షలు తీసుకుని ఆయన బదలీని అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి.
హడలెత్తిపోతున్న మహిళా అధికారులు
అధికారంలో ఉన్న నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారంటే ఉద్యోగులు ఒకింత భయభక్తులతోనే ఉంటారు. కానీ సదరు నేత వస్తే మాత్రం ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడే ఆ నేత తీరుతో అల్లాడిపోతున్నారు. ఆ మధ్య పాయకరావుపేటలోని ఎండీవో కార్యాలయానికి ఆ నేత వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి బదిలీపై వచ్చిన పంచాయతీరాజ్‌ మహిళా ఉద్యోగి సంతకాలు చేసే హడావుడిలో ఆ నేత రాకను గమనించలేదు. అంతే.. ‘నేనొచ్చినా పట్టించుకోవా.. నీసంగతి చూస్తా.. మళ్లీ నిన్ను కొండలెక్కించేస్తా’ అని వీరంగం వేసేశారట. ఇక నక్కపల్లి ఐసీడీఎస్‌ మహిళా అధికారిని సైతం ఇదేవిధంగా వేధింపులకు గురిచేశారని అంటున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల ఎంపిక మొత్తం తనకు చెప్పి చేయాలని నేత హుకుం జారీ చేశారు. అది సాధ్యం కాదని, జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీల ద్వారా ఎంపిక చేస్తారని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఆ మహిళా అధికారిపై నోరుపారేసుకున్నారని అంటున్నారు. ఎస్‌.రాయవరం మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి నక్కపల్లి మండలంలో లేని భూమిని ఉన్నట్టుగా చూపించి రికార్డులు తయారు చేయాల్సిందిగా ఆ నేత అధికారులపై ఒత్తిడి చేశారు. అలా కుదరదన్న అధికారులపై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్నారట.
భూ సేకరణలోనూ కాసుల వేట
నక్కపల్లి మండలంలో జరుగుతున్న భూసేకరణలో సదరు నేత నోట్ల కట్టలు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రికార్డులు తారుమారు చేసి  ప్రభుత్వ భూములను పార్టీ కార్యకర్తల పేరిట మార్చడం, ఆపై పరిహారం నొక్కేయడం అక్కడ తంతుగా మారింది. సదరు నేత బినామీ ఒకరు నక్కపల్లి మండలం సీతంపాలెం సర్వే నెం 1లో ఉన్న 240 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్రభుత్వ పెద్దలకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ భూమిని ఎన్నాళ్ల నుంచో సాగుచేస్తున్న రైతులకు డబ్బు ఆశ చూపి కొనుగోళ్లకు బేరం పెట్టారు. ఒక్కో రైతుకు రూ.50 వేలు చొప్పున అడ్వాన్స్‌ కూడా చెల్లించారు. అడ్వాన్సులు ఇచ్చిన రైతులకు డీఫారం పట్టాలు మంజూరు చేయాలని మండలస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పట్టాలు వచ్చిన తర్వాత రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు పక్కా ఆధారాలు ఉంటాయని భావించారు. అయితే సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పట్టాలు ఇవ్వలేమని ఓ తహశీల్దార్‌ అడ్డం తిరిగారు. అంతే ఆ అధికారిని బదిలీ చేయించిన సదరు నేత ఇప్పటికీ ఆ భూముల విక్రయాల కథను కొలిక్కి తీసుకురాలేకపోయారు. కానీ ఆ భూముల పేరిట పెద్దమొత్తంలో డబ్బులు కూడబెట్టుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇక కౌలురైతులుగా సదరు నేత అనుచరులు లేని భూమి ఉన్నట్టుగా రుణాలు పొందారన్న ఆరోపణలపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. అవినీతిపై ప్రశ్నించిన వారిని, అడ్డగోలు దందాలకు అడ్డొచ్చిన వారిని కులం పేరిట బెదిరించడం, నానాయాగీ చేయడం అక్కడ నిత్యకత్యంగా మారింది. ఈ దందాలన్నీ సరిపోలేదో.. లేక తన స్థాయి పెరిగిందన్న భ్రమల్లో ఉన్నారో గానీ.. క్యాబినెట్‌ హోదా పదవి కోసం ఆ నేత కొన్నాళ్లుగా పాకులాడుతున్నారు.. అటువంటి పదవి వచ్చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అధికార మత్తులో తూగుతున్న సదరు నేతకు మూడేళ్ల తర్వాత పరిస్థితేమిటన్నదే ఇప్పుడు అక్కడ అందరి నోళ్లలో నానుతున్న చర్చ.
 
మరిన్ని వార్తలు