నచ్చని వాళ్లను ఇబ్బందిపెట్టడం అలవాటే..

20 Nov, 2015 17:19 IST|Sakshi

విశాఖ:  కేంద్రమంత్రి  వెంకయ్యనాయుడు  కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు.  విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిస్ ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండిస్తోంటే, కాంగ్రెస్ మాత్రం మతం రంగు పులుముతోందని విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు.  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులమత శక్తులను  ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని వైఖరిని ప్రజలు గమనించాలని వెంకయ్య నాయుడు కోరారు.

తనకి నచ్చని వాళ్లని ఇబ్బందులకు గురి చేయడం  కాంగ్రెస్ కు అలవాటేనని వెంకయ్య ఆరోపించారు.  ప్రజల తీర్పుతో  అసహనానికి గురైన కాంగ్రెస్...  నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడాన్ని జీర్తించుకోలేకపోతోందన్నారు.  అందుకే ఎన్డీయే సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండి పడ్డారు.   దేశంలో అసహనం పెరుగుతోందంటూ అవార్డు వాపసీ పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై... నీతి ఆయోగ్ లో చర్చ  జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య నాయుడు వివరించారు.

మరిన్ని వార్తలు