తప్పుల పద్దు

31 Mar, 2016 03:53 IST|Sakshi
తప్పుల పద్దు

అవినీతిని కడిగేసిన ‘కాగ్’
ఖేడ్ పంచాయతీలో రూ.16.92 లక్షల దుర్వినియోగం
జెడ్పీటీసీ ఎన్నికల ఖర్చుల బిల్లులు చూపని అధికారులు
సిద్దిపేట మున్సిపాలిటీ పనుల్లోనూ గందరగోళం

సాక్షి, సంగారెడ్డి : ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతిని ‘కాగ్’ కడిగి పాడేసింది. ఎక్కడెక్కడ ఎలాంటి అవినీతి జరిగిందో కాగ్ తన నివేదికలో బహిరంగ పరిచింది. బుధవారం స్థానిక సంస్థల ఆడిటింగ్‌కు సంబంధించిన నివేదికను వెల్లడించింది. అందులో జిల్లాకు సంబంధించి పలు పద్దుల్లో అవకతవకలు జరిగినట్టు స్పష్టం చేసింది. ప్రధానంగా నారాయణఖేడ్ పంచాయతీ నిధుల వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. అదీగాక స్థానిక సంస్థల ఎన్నికల్లో వెచ్చించిన నిధులకు లెక్కలు సరిగా చూపలేదని, సిద్దిపేట మున్సిపాలిటీల్లో చేపట్టిన పనుల్లో గందరగోళం జరిగిందని వెల్లడిచింది. కాగ్ నివేదిక ప్రకారం...

నారాయణఖేడ్ పంచాయతీలో రూ.15.18 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయి. కాగా మరో పద్దులో రూ.1.74 లక్షలు తేడా ఉన్నట్టు ఆ నివేదిక వెల్లడించింది. నారాయణఖేడ్ పంచాయతీలో 2015 జూలై రికార్డులు ఆడిట్ చేయగా పన్నులు, ఆదాయాల రూపంలో 2012-15 సంవత్సరాల నడుమ వసూలు చేసిన రూ.16.92 లక్షల డబ్బులు ఖజానాలో జమ కాలేదు. 2015 ఆగస్టు వరకు నారాయణఖేడ్ గ్రామ పంచాయతీ వసూలు చేసిన రూ.5.70 లక్షలు, రూ.7.99 లక్షలు మొత్తాన్ని ఖజానాలో చెల్లించకుండా పంచాయతీ ఖర్చులకు వాడుకున్నారు. పంచాయతీ వసూలు చేసిన రూ.3.23 లక్షలో రూ.1.49 లక్షలు జూలై, ఆగస్టు 2015 నెలల్లో ఖజానాల్లో జమచేసినట్టు  చెబుతుండగా అందుకు సంబంధించిన పత్రాలు పంచాయతీ దగ్గర లేవు. అలాగే రూ.1.74 లక్షల మొత్తాన్ని జమ చేయడంలో తిరిగి జాప్యం చేయడం తాత్కాలిక నిధుల దుర్వినియోగానికి దారితీసింది.

స్థానిక ఎన్నికల నిధుల్లోనూ...
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అప్పటి జెడ్పీ సీఈఓ రూ.6.39 కోట్ల నిధులు ఏసీ(అబ్‌స్ట్రాక్ కంటింజెంట్) బిల్లుల ద్వారా తీసుకున్నారు. రూ.6.13 కోట్లు ఖర్చు చేసినట్లు డిటెయిల్డ్ కంటిజెంట్(డీసీ) బిల్లుల్లో సూచించారు. మిగిలిన రూ.26 లక్షలు ఇంకా ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉందని సీఈఓ పేర్కొన్నారు. అయితే రూ.6.13 కోట్ల నిధులు వ్యయానికి సంబంధించి జెడ్పీ సీఈఓ బిల్లులు పొందుపర్చలేదని కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిద్దిపేట మున్సిపాలిటీలో ఐహెచ్‌ఎస్‌డీపీ కింద చేపట్టాల్సిన మురికి కాల్వలు, రహదారుల నిర్మాణం పనులు నిర్దిష్టమైన సమయంలో పూర్తికాలేదని, పనుల కొలతల్లో తేడాలు ఉన్నట్లు వెల్లడించింది. సిద్దిపేట మున్సిపాలిటీలో నిర్మించాల్సిన నాలుగు సామాజిక వినియోగ కేంద్రాలను ఇంకా ఏర్పాటు చేయలేదని తెలిపింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు