ఇంతకీ ఆ రూ.129 కోట్లు ఏమైనట్లు?

30 Mar, 2016 19:34 IST|Sakshi
ఇంతకీ ఆ రూ.129 కోట్లు ఏమైనట్లు?

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించిన పీడీ ఖాతా నిల్వల మొత్తంలో అంకెల మార్పు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై కంట్రోలర్ ఆడిటింగ్ జనరల్ (కాగ్) ఆక్షేపణ కూడా తెలియచేసింది. బుధవారం శాసనసభలో ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. ఇందులో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ అకౌంట్లకు సంబంధించి పేజీ 58లో చిత్తూరు జిల్లా డీటీఓ అంశాన్ని కాగ్ ప్రస్తావించింది. '2014 మార్చి 31 చివర ఉన్న పీపీఓ, చిత్తూరుకు సంబంధించిన పీడీ ఖాతా మిగులు నిల్వను రూ.331.71 కోట్ల నుంచి రూ.202.44 కోట్లకు చిత్తూరు డీటీఓ మార్చారు.

మిగులును రూ.129.27 కోట్ల మేర తగ్గించడంపై కారణాలను రికార్డు చేయకపోవడం వల్ల నిధుల దుర్వినియోగం, ధనాపహరణలను కనిపెట్టడానికి వీలు లేకుండా పోయింది. ఇది వ్యవస్థ తీరును బహిరంగ పరుస్తోంది' అని కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. ఇంత పెద్దమొత్తంలో నిధులకు సంబంధించిన గణాంకాలను మార్చి కారణాలను పేర్కొనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగ్ అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఏమిస్తుందో వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తలు