కాల్‌మనీ వేధింపులు

5 Nov, 2016 23:13 IST|Sakshi

– పురంలో కొనసాగుతున్న వడ్డీ వ్యాపారుల దందా
హిందూపురం అర్బన్‌ : పట్టణంలో వడ్డీ వ్యాపారుల దందా కొనసాగుతోంది. కొంతకాలం క్రితం కాల్‌మనీ వ్యవహారంపై పోలీసులు తీవ్రంగా పరిగణించడంతో అఘ్నాతంలోకి వెళ్లిన వడ్డీ వ్యాపారులు తిరిగి వచ్చి దందా యథావిధిగా కొనసాగిస్తున్నారు. రోజు, వారం, నెలసరి పద్ధతిలో వడ్డీలు చెల్లింపులతో రోజుకు రూ.40 లక్షలకు పైగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.

హిందూపురం పట్టణంలో వడ్డీ వ్యాపారులు సుమారు 40 మంది ఉన్నారు. వారు ప్రతిరోజు చిన్న వ్యాపారులు, కిరణాషాపుల వారికి పెద్దమొత్తాల్లో వడ్డీలకు అప్పు ఇచ్చి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. అవసరాలకు వడ్డీలు తీసుకున్న వ్యాపారులు కరువు పరిస్థితుల కారణంగా సరిగా వ్యాపారాలు జరగకపోవడంతో వడ్డీలు, అసలు చెల్లించలేకపోవడంతో వారి రుణాలు చక్రవడ్డీ రీతిలో పెరిగిపోతున్నాయి.

వ్యాపారులే కాకుండా ఆర్టీసీ కార్మికులు, రైల్వే కార్మికులు కూడా కాల్‌మనీ ఉచ్చులో ఇరుక్కుపోయారు. ప్రతి నెలా వారికి వచ్చే వేతనాన్ని బ్యాంకుల్లో డ్రా చేసుకోలేకపోతున్నారు. వడ్డీ వ్యాపారులు వారి ఏటీఎం కార్డులు లాగేసుకుని ఆ నెల వడ్డీ, అసలు పట్టుకుని మిగిలిన మొత్తాన్ని వారికి ఇస్తున్నారు. చాలీచాలని మొత్తంతో ఇల్లు, పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చుకోలేక తిరిగి అప్పులు చేస్తూ కాల్‌మనీ చట్రంలో ఇరుక్కుపోయి వేధింపులకు గురవుతున్నారు.

రోజువారి వడ్డీతో మొదలు
వ్యాపారం రోజువారి వడ్డీతో మొదలవుతోంది. చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వారికి ఉదయం రూ.900 ఇస్తే సాయంత్రానికి రూ.వెయ్యి ఇవ్వాలి. ఇదే రీతిలో రూ.9 వేలు ఇస్తే రూ.10 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వడ్డీ వ్యాపారం జోరుగా సాగిపోతోంది. పట్టణంలో ఉన్న వారికి తోడు ఇటీవల గుంటూరు ప్రాంతం నుంచి కొందరు వ్యాపారులు వచ్చి వడ్డీ వ్యాపారానికి దిగారు. టింబర్, ఐరన్‌ వ్యాపారులకు భారీ మొత్తంలో అప్పు ఇచ్చి వడ్డీ రూపంలో వారి లాభాలను పిండేస్తున్నారు.

మరిన్ని వార్తలు