నగ్నచిత్రాల బాధితురాలి ఆందోళన

3 Apr, 2016 14:51 IST|Sakshi
రవికాంత్ ఇంటి ముందు మహిళలతో కలసి ధర్నా చేస్తున్న బాధితురాలు

నిందితుడి ఇంటిముందు ధర్నా

విజయవాడ (కృష్ణలంక): విజయవాడలో అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు నగ్న ఫొటోలు తీసి బెదిరించిన మండవ రవికాంత్ ఇంటిముందు బాధితురాలు శనివారం తన మద్దతుదారులతో ఆందోళన చేపట్టారు. మండవ రవికాంత్ ఓ మహిళ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వమని ఆమె అడిగినందుకు రవికాంత్ తన రెండో భార్య శ్రీదేవితో ఆమె నగ్నఫొటోలు తీయించి బెదిరించిన విషయం విదితమే. దీనిపై పోలీసులు రవికాంత్‌ను విచారిస్తున్నారు.

శనివారం బాధితురాలు తన మద్దతుదారులతో కృష్ణలంక సత్యంగారి హొటల్ రోడ్డులోని రవికాంత్ మొదటి భార్య ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ‘తనను శ్రీదేవి బెదిరిస్తోందని, నగ్నచిత్రాలు తన వద్దే ఉన్నాయని, తాను తన అక్క (రవికాంత్ మొదటి భార్య) ఇంటి వద్ద ఉన్నానని ఫోన్‌లో బెదిరిస్తోంది’ అని బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

మండవ మొదటి భార్య ఇంట్లో శ్రీదేవి లేకపోవడాన్ని గమనించారు. సింగ్‌నగర్ సీఐ బాలమురళి మాట్లాడుతూ రవికాంత్‌కు సంబంధించిన పెన్‌డ్రైవ్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శ్రీదేవి నుంచి ఎటువంటి అపాయం జరగకుండా ఉండేలా బాధితురాలికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితురాలు ఆందోళన విరమించారు.  

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు