మిర్చి కొనుగోలు చేయలేం!

7 May, 2017 00:23 IST|Sakshi
– కర్నూలు మార్కెట్‌లో చేతులెత్తేసిన వ్యాపారులు
– మార్కెట్‌ కమిటీ అధికారులో కలెక్టర్‌ సమీక్ష
 
కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్ర ప్రభుత్వం మిర్చికి క్వింటాకు రూ.1500 మద్దతు ధర ప్రకటించి.. కర్నూలు మార్కెట్‌ యార్డులో కూడా కొనుగోళ్లు జరపాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కర్నూలు మార్కెట్‌ యార్డులో మిర్చి కొనుగోలు చేయలేమని వ్యాపారులు చేతులెత్తేశారు. శనివారం..మార్కెట్‌ కమిటీ అధికారులు, కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తన చాంబరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మార్కెట్‌లో కొనుగోళ్లు జరిపేందుకు సహకరించాలని వ్యాపారులకు సూచించారు. అయితే కర్నూలు మార్కెట్‌కు వస్తున్న మిర్చిలో నాణ్యత లేదని, ప్రభుత్వం రూ.1500 మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కొనుగోళ్లు జరుపడం సాధ్యం కాదని వ్యాపారులు పేర్కొన్నారు. తాము తొమ్మిది మందిమి ఉన్నామని.. స్థానిక అవసరాలకు అనుగుణంగా మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నామని, వేలాది క్వింటాళ్లు అయితే తమకు చేతకాదని  చేతులెత్తేశారు. మార్కెట్‌ కమిటీ సెక్రటరీ శాస్త్రీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కలెక్టర్‌ స్పందిస్తూ కర్నూలు మార్కెట్‌ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామని, అక్కడి నుంచి వచ్చే స్పందనను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందామని తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, కమిషన్‌ ఏజెంట్ల అసోషియేషన్‌ నేతలు కట్టా శేఖర్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు