279 జీవో రద్దుచేయాలి

9 Dec, 2016 22:05 IST|Sakshi
279 జీవో రద్దుచేయాలి

విజయవాడ (అజిత్‌సింగ్‌ నగర్‌) : మున్సిపల్‌ కార్మికుల జీవితాలను కాలరాసే నిర్ణయాలను ప్రభుత్వం మానుకోవాలని, కార్మికుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్‌ 279ను వెంటనే రద్దు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. డ్వాక్రా, సీఎంఈవై కార్మికులను కార్పొరేషన్‌కు బదులు కాంట్రాక్టర్లకు అప్పగించే విధంగా విడుదలచేసిన జీవో నంబర్‌ 279ను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రకాష్‌నగర్‌లో శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, ఈ జీవో వల్ల ఇన్నేళ్లుగా పనిచేస్తున్న డ్వాక్రా, సీఎంఈవై కార్మికులంతా ఉద్యోగ భద్రతను కోల్పోయి కాంట్రాక్టర్ల చెప్పు చేతల్లో నలిగిపోవాల్సిందేనన్నారు. యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి ఎం.డేవిడ్‌ మాట్లాడుతూ డ్వాక్రా కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ఈ జీవో వల్ల కార్మికులకు, వారి కుటుంబాలకు కలిగే నష్టాలను ప్రభుత్వం తెలుసుకుని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రకాష్‌నగర్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన పైపులరోడ్డు మీదుగా డాబాకొట్లు సెంటర్‌ వరకూ సాగింది. సీఐటీయూ సెంట్రల్‌ జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గారావు, రమణరావు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు చింతల శ్రీను, బుజ్జమ్మ, వేముల దుర్గ, సీతమ్మ, సుశీల, తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు