క్యాన్సర్ తో పోరాడలేక..

7 Jul, 2016 03:57 IST|Sakshi
క్యాన్సర్ తో పోరాడలేక..

తనువు చాలించిన భువనేశ్వరి
రోదిస్తున్న హోంగార్డు కుటుంబం

ప్రొద్దుటూరు క్రైం: ‘నన్ను బతికించుకోండి నాన్నా.. నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలవుతారు.. అంటూ ఆమె ప్రతి రోజూ తల్లిదండ్రులను వేడుకునేది.  ఏడు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాటం చేసింది. ఇక నా వల్ల కాదంటూ తనువు చాలించింది’. ప్రొద్దుటూరులో  హోంగార్డు గా పనిచేస్తున్న కరుణాకర్ కుమార్తె భువనేశ్వరి (32) బుధవారం మృతి చెందింది. కొద్ది కాలంగా  క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం మృతి చెందింది.

 ఏడు నెలలు క్యాన్సర్‌తో పోరాడి..
భువనేశ్వరికి 13 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన గోపాల్‌తో వివాహమైంది. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త మద్యానికి బానిసై భార్యా పిల్లలను పట్టించుకోకపోవడంతో రెండేళ్ల నుంచి ఆమె ప్రొద్దుటూరులోని తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం రొమ్ము క్యాన్సర్ సోకింది. రొమ్ముపై గడ్డ ఉండటంతో అది వేడిగుల్ల అనుకొని నిర్లక్ష్యం చేసింది. చివరకు మూడు నెలల క్రితం డాక్టర్‌కు చూపించగా క్యాన్సర్ గడ్డ అని చెప్పారు.

అప్పటికే క్యాన్సర్ బాగా ముదిరిపోయింది. చేతిలో డబ్బు లేకపోవడం, అవగాహనా రాహిత్యంతో ఆమెకు సకాలంలో వైద్యం అందలేదు. ఇటీవల చెన్నై, హైదరాబాద్‌కు తీసుకెళ్లినా ఫలితం లేదు. వైద్య సేవ కార్డు లేదని వారిని హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రి అధికారులు వెనక్కి పంపించారు. ఈ క్రమంలోనే ఆమె దీనస్థితి గురించి సాక్షిలో రెండు రోజుల క్రితం ‘నిరుపేద.. ఆపై క్యాన్సర్ బాధ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కొందరు దాతలు సాయం చేస్తామంటూ వారికి ఫోన్‌లు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా ఒక అధికారి ఫోన్ చేయగా భువనేశ్వరి అన్న అక్కడికి వెళ్లాడు. తాత్కాలిక వైద్యసేవ కార్డు ఇవ్వడమే గాక ఏ విధంగా ఆస్పత్రికి వెళ్లాలో అతనికి వివరించారు. అయితే అంతలోపే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మృతి చెందింది.

 విలపిస్తున్న పిల్లలు..
భువనేశ్వరి బిడ్డలు తల్లి మృతదేహాన్ని చూసి రోదించసాగారు.  ఫోన్ పని చేయకపోవడంతో భువనేశ్వరి మృతి చెందిన విషయం ఆమె భర్తతో పాటు అతని వద్ద ఉంటున్న మరో కుమార్తెకు తెలియలేదు. కన్నబిడ్డను కాపాడుకోలేకపోయామంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

మరిన్ని వార్తలు