కేన్సర్ ను తొలి దశలోనే గుర్తించాలి

1 Jul, 2016 03:17 IST|Sakshi
కేన్సర్ ను తొలి దశలోనే గుర్తించాలి

జిల్లా కేంద్రంలో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

ఖమ్మం/ఖమ్మం వైద్యవిభాగం : కేన్సర్ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుందని, దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే చికిత్స సులభంగా చేయవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నగరంలోని మమత ఆస్పత్రి ఆవరణలో హరితహారం, ప్రభుత్వాస్పత్రిలో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల కల్పన, ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో గురువారం మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందన్నారు.

పేదలకు ఇబ్బంది లేకుండా జిల్లా కేంద్రాల్లో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు, డిజిటల్ ఎక్స్‌రే, కొత్త పడకల ఏర్పాటుతోపాటు సివిల్ పనులను పూర్తి చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతీ ఏటా విషజ్వరాలు, ఇతర కారణాలతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిని మంత్రి లక్ష్మారెడ్డితోపాటు రెండు రోజులు పరిశీలించి.. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలంటే పోస్టులు భర్తీ చేయాలని మంత్రి లక్ష్మారెడ్డిని కోరారు.

ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రధానాస్పత్రిలో సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసి.. రూ.50లక్షల నిధులు కేటాయించిందన్నారు. ఖమ్మం ఆస్పత్రిని 450 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ కవిత, మేయర్ పాపాలాల్, కలెక్టర్ లోకేష్‌కుమార్, డిప్యూటీ మేయర్ మురళి, జిల్లా వైద్యాధికారి కొండల్‌రావు, డీసీహెచ్ అనందవాణి, సూపరింటెండెంట్ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

 పలు విభాగాల పరిశీలన
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లక్ష్మారెడ్డి డాక్టర్ కావటంతో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పరీక్షించారు. అనంతరం ఆస్పత్రిలో మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని వారు పరిశీలించారు. నత్తనడకన పనులు సాగుతుండటంతో ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరాలోగా కేంద్రాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను త్వరితగతిన కూల్చివేయాలన్నారు.

 మూడు రోజుల్లో ‘104’ తిరగాలి..
ఆస్పత్రి వెనుక భాగంలో మూలనపడి ఉన్న 104 వాహనాల వద్దకు వెళ్లిన మంత్రి లక్ష్మారెడ్డి.. అవి ఎందుకు తిరగట్లేదని డీఎంహెచ్‌ఓ కొండలరావును ప్రశ్నించారు. సగానికి పైగా వాహనాలు వాడకపోవడంతో మంత్రి అధికారులపై మండిపడ్డారు. అన్ని జిల్లాల్లో తిరుగుతున్నా.. ఇక్కడ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా మూలనపడ్డ వాహనాలన్నీ రోడ్లపైకి రావాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో రూ.10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ట్రామాకేర్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న ఆయుష్ విభాగంలోకి వెళ్లి.. రోజూ ఎంతమంది వైద్యం చేయించుకుంటున్నారని అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

 సీజనల్ వ్యాధులపై దృష్టి
భద్రాచలం : సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. భద్రాచలంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఖాళీల వివరాలు తెప్పించుకున్నామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి ని ఆపటం ఎవరితరం కాదన్నారు.

మరిన్ని వార్తలు