అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు

28 Jun, 2016 22:20 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి నగరానికి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలోని నూర్మతి గ్రామానికి చెందిన కిమ్ముడు మల్లేష్ ఆటోడ్రైవర్. 2011లో ఇతడి స్నేహితుడు సి.రాజు ఒక రోజు బాడుగకు మల్లేష్ ఆటోను తీసుకున్నాడు.

దీన్ని వినియోగించిన రాజు విశాఖ అటవీ ప్రాంతమైన గుండెల్లి నుంచి గంజాయి ఖరీదు చేసి అక్రమ రవాణా చేస్తూ వి.మాడుగుల పోలీసులకు చిక్కాడు. ఆటోను బాడుగకు ఇచ్చిన ఆరోపణలపై పోలీసులు మల్లేష్‌ను కూడా అరెస్టు చేశారు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన ఇతగాడు గంజాయి అక్రమ రవాణాను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి ఖరీదు చేసి హైదరాబాద్‌తో పాటు విజయవాడలో ఉన్న వ్యక్తులకు ఎక్కువ ధరకు హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నాడు.

మల్లేష్‌కు కొన్నాళ్ల క్రితం విజయవాడకు చెందిన ప్రైవేట్ టీచర్ గొల్ల కల్యాణ్ బాబుతో పరిచయమైంది. కొన్ని రోజుల క్రితం మల్లేష్‌కు ఫోన్ చేసిన కల్యాణ్ హైదరాబాద్‌కు చెందిన సాగర్, విజయ్‌సింగ్‌లకు గంజాయి సరఫరా చేయాలని చెప్పాడు. దీంతో వీరిద్దరూ కలిసి విశాఖపట్నంలోని థంగులం గ్రామానికి చెందిన కామరాజుకు రూ.5 వేలు అడ్వాన్స్ ఇచ్చి 40 కేజీల గంజాయి తీసుకున్నారు. దీన్ని డెలివరీ చేసేందుకు కారులో తీసుకుని మంగళవారం నగరానికి చేరుకున్నారు.

దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి షాహినాయత్‌గంజ్‌లోని జోషివాడి వద్ద కాపుకాసి పట్టుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు కేసును సీసీఎస్ ఆధీనంలోని యాంటీ నార్కోటిక్ సెల్ విభాగానికి అప్పగించారు. పరారీలో ఉన్న నగరవాసులు సాగర్, విజయ్‌సింగ్‌లతో పాటు థంగులం గ్రామానికి చెందిన కామరాజు కోసం గాలిస్తున్నట్లు అదనపు డీసీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు