రాజధానిలో ఇక ఇళ్ల వంతు

27 Sep, 2016 18:16 IST|Sakshi
ఓ ఇంటి యజమానికి అందిన నోటీసు
* అక్రమ నిర్మాణాలంటూ ఆరోపణ
నోటీసులు జారీచేస్తున్న సీఆర్‌డీఏ అధికారులు
ఆందోళనలో యజమానులు
 
మంగళగిరి:  రాజధాని గ్రామాల్లో ఇప్పటివరకు భూములపైనే కన్నేసిన ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం తాజాగా ఇళ్ల జోలికి రావడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతులు ఇప్పటికీ వేలాది ఎకరాల భూసమీ కరణకు అంగీకరించలేదు. దీంతో సామాజిక అంచనా మదింపు చేసి భూసేకరణ చేస్తామని అధికారులు బెదిరించినా లొంగలేదు. ఇప్పుడు కొత్తగా నివాసాలకు నోటీసులివ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. కురగల్లు గ్రామంలో ఇళ్లు కట్టుకున్న తొమ్మిదిమంది యజమానులకు సీఆర్‌డీఏ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఆర్‌డీఏ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు లేవని, అనుమతులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ  నిర్మాణాలను మీరే ఐదు రోజులలోపు తొలగిం చాలని నోటీసులిచ్చారు. సీఆర్‌డీఏ ఏర్పాటుకాకముందు నిర్మించిన గృహాలవారికి కూడా నోటీసులు రావడం గమనార్హం.  రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ  క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సీఆర్‌డీఏ అనుమతి లేని అన్ని నివాసాలకు నోటీసులు జారీ చేస్తామని చెబుతుండడం ఆయా గ్రామాల్లోని గృహాల యజమానులను ఆందోళన కలిగిస్తోంది. గ్రామకంఠం పరిధిలో నిర్మించుకున్న గృహాలను తొలగించబోమని తొలుత చెప్పిన మంత్రులు, అధికారులు.. ఇప్పుడు గ్రామకంఠంలో నిర్మించుకున్న నివాసాలకు నోటీసులు ఎలా జారీ చేస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.  నివాసాల జోలికొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.
 
నివాసాల జోలికొస్తే ఊరుకోం..
సీఆర్‌డీఏని ఏర్పాటుచేయకముందే  కురగల్లు గ్రామంలో పంచాయతీ అనుమతి తీసుకుని ఇల్లు కట్టుకున్నాం.  మాది అక్రమ కట్టడమంటూ అధికారులు నోటీసు ఇచ్చారు. నివాసాల జోలికొస్తే ఊరుకునేది లేదు. భూములనూ లాక్కుని, నివాసాలనూ లాక్కుంటే మేమంతా ఎక్కడికి వెళ్లాలి?  
– తాడిబోయిన వెంకటేశ్వరరావు, నోటీసు అందకున్న గృహ యజమాని
మరిన్ని వార్తలు