-

అక్రమంగా విక్రయిస్తున్న భారీ మద్యం పట్టివేత

31 Jul, 2016 22:09 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న మద్యాన్ని చూపిస్తున్న ఎక్సైజ్‌ పోలీసులు

తార్నాక: అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. తార్నాకలోని మారేడుపల్లి ఎక్సైజ్‌ కార్యాలయంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి. భగవంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...  బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్‌ పరిధిలో మద్యం షాపులు బంద్‌ చేశారు. అయితే, అడ్డగుట్ట పరిధిలోని మంగోర్‌ బస్తీలో యు. చోటు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అధికారులు ఆ ఇంటిపై దాడి చేసి రూ. 2 లక్షల విలువ చేసే వివిధ బ్రాండ్లకు చెందిన 53 కాటన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోటు పరారీ కాగా.. అతని భార్య నిర్మలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదే ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తూ గతంలో పట్టుబడ్డ యు.వాణిశ్రీ అనే మహిళ బోనాల సందర్భంగా అధిక ధరలకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేసి.. చోటు ఇంట్లో నిల్వ చేసినట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న వాణిశ్రీ, చోటు కోసం గాలిస్తున్నామని, కేసు తదుపరి విచారణను మారేడుపల్లి ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వప్నకు అప్పగించారు. ఈ దాడిలో  ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు జి.శ్రీనివాసరావు, వేమారెడ్డి, ఎస్సైలు కె.కరుణ, చంద్రశేఖర్, రమహమత్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు