పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు

26 Aug, 2016 21:23 IST|Sakshi
పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
 
  •  20 మందికి పైగా గాయాలు
  •  ఇద్దరి పరిస్థితి విషమం 
బిట్రగుంట : బోగోలు మండలం ముంగమూరు కూడలి వద్ద శుక్రవారం జాతీయ రహదారిపై పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది స్వల్పంగా, పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల సమాచారం మేరకు.. కావలి మండలం తాళ్లపాళెం పంచాయతీ జువ్విగుంటపాళెంకు చెందిన కుడుముల వెంకయ్యకు మాతినవారిపాళెంకు చెందిన వెంకట శేషమ్మ వివాహాన్ని బిలకూట క్షేత్రం కొండపై నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు జువ్విగుంటపాళెంకు చెందిన బంధువులు, స్థానికులు ట్రాక్టర్‌లో తరలివచ్చారు. అనంతరం వధూవరులిద్దరూ ఆటోలో, వివాహానికి హాజరైన బంధువులు ట్రాక్టర్‌లో జువ్విగుంటకు బయలుదేరారు. ట్రాక్టర్‌ ముంగమూరు కూడలి వద్ద హైవేను క్రాస్‌ చేస్తుండగా కావలి నుంచి నెల్లూరు వైపు మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జుకాగా ట్రాక్టర్‌ బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ట్రక్కులో ఉన్న పెళ్లి బృందంలో 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 12 మందికి స్వల్పంగా, 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను 108, ఇతర వాహనాల్లో కావలికి ఏరియా ఆసుపత్రికి, ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. క్షతగ్రాతుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందిన వెంటనే బిట్రగుంట పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను ఆసుపత్రులకు తరలించడంతో పాటు రోడ్డుపై అడ్డుగా ఉన్న వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అల్లిమడుగు సర్పంచ్‌ భర్త చిట్టమూరు మల్లికార్జున రెడ్డి కూడా సహాయక చర్యలు అందించారు. 
మరిన్ని వార్తలు