అవసరమైతేనే అక్కడికి వెళ్లాలంటా!

9 Sep, 2016 23:05 IST|Sakshi
మాట్లాడుతున్న డాక్టర్‌ సోమరాజు

రాయదుర్గం: వైద్య రంగంలో సాంకేతికంగా వస్తున్న మార్పులను ప్రజలు అందిపుచ్చుకోవాలని కేర్‌ ఆస్పత్రి సీఎండీ డాక్టర్‌ సోమరాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ‘చేంజింగ్‌ రోల్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ ప్రస్పెక్టివ్‌’ అంశంపై ఒక రోజు జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎవరికివారు షుగర్‌ లెవల్స్, బ్లడ్‌ప్రెషర్‌ తెలుసుకునే పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు, ఆస్పత్రులను పరిశుభ్ర వాతావరణంలో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రుల నిర్వహణా లోపం, వైద్యుల తప్పిదాల కారణంగా ఏటా 98 వేల మంది రోగులు మృత్యువాత పడుతున్నారన్నారు. పరిస్థితులకు అనుగుణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, ప్రతి చిన్న రోగానికి ఆస్పత్రికి వెళ్లడం మంచిది కాదన్నారు.

డీఎంఈ డాక్టర్‌ ఎం రమణి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. మెరుగైన వైద్య సేవలు, అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు.  కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్‌ రాజశేఖర్, డాక్టర్‌ సీత, డాక్టర్‌ జీవిఆర్‌కె ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు