వడదెబ్బ నుంచి తప్పించుకోండిలా..

27 Mar, 2017 19:00 IST|Sakshi
వడదెబ్బ నుంచి తప్పించుకోండిలా..
నిడమర్రు: రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. దాంతో వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ అంటే ఏమిటి.. దాని లక్షణాలు.. నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం.
 
 వడదెబ్బ అంటే..?
ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై  ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటాన్ని వడదెబ్బ అంటారు. అత్యధిక వేడి వాతావరణం లేదా అధిక శారీరక శ్రమను శరీరం తట్టుకోలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈస్థితిలో శరీరంలో సహజంగా జరగాల్సిన చర్యలు జరగకపోవడం వల్ల దాని ప్రభావం అవయవాల పనితీరుపై పడుతుంది. దాంతో వడదెబ్బ తగిలిన వ్యక్తి నీరసించి కుప్పకూలిపోతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది.
 
లక్షణాలు
గుండె / నాడి కొట్టుకునే వేగంలో ఆకస్మిక మార్పు, వేగంగా / తక్కువగా శ్వాస తీసుకోవడం, చెమట పట్టకపోవడం, ఎక్కువ/ తక్కువ రక్తపోటు, చిరాకు, కంగారు, తలతిరగడం, శరీరం గాలిలో తేలిపోతున్నట్టు ఉండటం, తలపోటు, వికారం, వాంతులు, అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ తగిలినవారిలో సహజంగా కనిపించే లక్షణాలు. 
 
ప్రాథమిక చికిత్స
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకొచ్చి ఆ వ్యక్తి శరీరాన్ని చల్లబరచాలి. రోగి శరీరాన్ని చల్లటి నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. 
 
రోగి తాగ గలిగితే చల్లటి పానీయాలు ఇవ్వాలి. వదులు దుస్తులు కట్టాలి.
 
 ఎటువంటి మందులు ఇవ్వకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి
 
ముందు జాగ్రత్తగా
 వేసవిలో డీ హైడ్రేషన్‌ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాలి. నీరు శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది.
 ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎండలో పనిచేసేవారయితే మధ్యమధ్యలో నీడ పట్టుకు వచ్చి సేదతీరుతూ ఉండాలి.
గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు సాధారణ వ్యక్తుల కంటే తొందరగా డీ హైడ్రేషన్‌ ప్రభావానికి గురవుతారు. 
 
ఆల్కహాల్, సిగరెట్, కార్బోనేటెడ్‌ ద్రావణాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల శరీరంలో ఉండే నీటి నిల్వలు తొందరగా తగ్గిపోతాయి.
 
 ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌గ్లాస్, తలకు టోపీ వంటివి ధరించడం మంచింది.
 
వేసవి కాలంలో బయటకు వెళ్లే అవసరం ఉంటే ఉదయ, సాయంత్రం వేళల్లో మాత్రమే వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం.
 
వేడి వాతావరణంలో శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు చేయడం మంచింది కాదు. ఒక వేళ శారీరక శ్రమ అధికంగా ఉండే వృత్తుల్లో ఉన్నవారయితే తరచూ శక్తినిచ్చే పానీయాలు తాగాలి.  
 
ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి, కారం, మసాలాలు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
 
 బయటకు వెళ్ళిన సందర్భాల్లో టీ, కాఫీ, వేపుడు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ మానెయ్యాలి. వాటి బదులుగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి
 
ప్రయాణాల్లో సోడియం వంటి ఎలక్ట్రోలైట్‌  ద్రావణాలను త్రాగటం మంచిది
 
 వేసవిలో  వాంతులు, అలసట, బలహీనంగా కనిపించడం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి.
 
 
వయసుతో నిమిత్తం లేదు
 
 పి.సతీష్‌కుమార్‌రాజు, వర్మ హాస్పిటల్, గణపవరం
ఏ వయసువారైనా వడదెబ్బ బారిన పడొచ్చు. వారిలో పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మధుమేహ వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యపానం అలవాటు ఉన్న వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. అలాగే కొన్ని రకాల ఔషధాలు కూడా వడదెబ్బకు కారణమవుతాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.
 
మరిన్ని వార్తలు