63 మందిపై కేసు కొట్టివేత

15 Feb, 2017 22:43 IST|Sakshi

గుత్తి (గుంతకల్లు) : మెయిల్‌ గ్రీన్‌ పవర్‌ లిమిటెడ్‌ కంపెనీ వేసిన కేసులో పెన్నానది పరివాహక పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట లభించింది. 63 మందిపై నమోదైన కేసును గుత్తి జేఎఫ్‌సీఎం జడ్జి వెంకటేశ్వర్లు బుధవారం కొట్టివేశారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం నాగలాపురం (చిట్టూరు) వద్ద మెయిల్‌ గ్రీన్‌ పవర్‌ కంపెనీ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. అక్కడ అక్రమంగా బావి (ఇన్‌ఫిల్‌ట్రేషన్‌ వెల్‌) తవ్వింది. పెన్నానదికి సంబంధించిన అన్ని కాలువలనూ ఈ బావిలోకి మళ్లించింది. చుట్టుపక్కల 20 గ్రామాల్లో ఐదు వేల బోర్లు ఎండిపోయాయి.

ఆయా గ్రామాల్లో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. దీంతో కంపెనీపై పోరాటం చేయడానికి రైతులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమయ్యారు. పెన్నానది పరీవాహక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ సభ్యులు బావిని పూడ్చి వేయాలని పదిరోజులపాటు ఆందోళలనలు నిర్వహించారు. బావిని పూడ్చి వేయడానికి ప్రయత్నించారు. దీంతో కంపెనీ నిర్వాహకులు కమిటీలోని 63 మందిపై 427, 447, 147, 188, 353 సెక‌్షన్ల కింద 2013 మేలో కేసు నమోదు చేయించారు. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. ఈ కేసు పలు విచారణల అనంతరం బుధవారం గుత్తి జేఎఫ్‌సీఎం కోర్టులో తుది విచారణకు వచ్చింది. తుది విచారణలో 63 మంది కమిటీ సభ్యులపై కేసును కొట్టివేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ సంగీత వాదించారు.

కోర్టు తీర్పు.. కంపెనీకి చెంప పెట్టు
తమపై అక్రమంగా బనాయించిన కేసును కోర్టు కొట్టివేయడం మెయిల్‌ గ్రీన్‌ పవర్‌ కంపెనీ ప్రతినిధులకు చెంప పెట్టులాంటిదని పెన్నానది పరివాహక పరిరక్షణ కమిటీ సభ్యులు శరత్‌ చంద్రారెడ్డి (వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ ప్రధాన కార్యదర్శి), ఓబుల కొండారెడ్డి (రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌), ఇమామ్‌ (కదిలిక ఎడిటర్‌), న్యాయవాదులు సంజయ్‌ యాదవ్,  ధనుంజయ, వెంకటరమణారెడ్డిలు అభివర్ణించారు. తమపై బనాయించిన కేసును కొట్టివేసిన అనంతరం కోర్టు ఆవరణలోనే వారు విలేకరులతో మాట్లాడారు.

మెయిల్‌ గ్రీన్‌ పవర్‌ కంపెనీ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు బావిని తవ్వి పెన్నానది నీటితో పాటు  వంకల, కాలువల నీళ్లను బావిలోకి మళ్లించడం కారణంగా ఉష్ణోగ్రత 49 డిగ్రీలకు చేరుకుందన్నారు. దీంతో గొర్రెలు, పశువులు ఉదయం 11 గంటలకే వేడిమిని భరించలేక ఇళ్లకు వెళ్లిపోతున్నాయన్నారు. పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతినిందన్నారు. నాగలాపురం, గంజికుంట పల్లి, చిట్టూరు గ్రామాల్లోని పిల్లలకు చర్మవ్యాధులు సోకాయన్నారు. భూములను, కాలువలను, దారులను చివరకు దేవాలయ భూములను సైతం కంపెనీ నిర్వాహకులు ఆక్రమించారన్నారు. ఇప్పటికైనా కంపెనీపై చర్యలకు ఉపక్రమించకపోతే మరోసారి పోరాటాలకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు