మంత్రిపై అ్రట్రాసిటీ కేసుకు డిమాండ్‌

22 Aug, 2017 02:16 IST|Sakshi

నెల్లిమర్ల: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ ఉద్యమ వేదిక జిల్లా కన్వీనర్‌ గంటాన అప్పారావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక మండలశాఖ అధ్యక్షురాలు భోగాపురపు మంగమ్మతో కలిసి సోమవారం నెల్లిమర్ల తహసీల్దారు చిన్నారావుకు వినతిపత్రం అందించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో దళితులను కించపరుస్తూ మంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు.

ఎంతకాలం గడిచినా, ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా దళితులు అభివృద్ధి సాధించలేరని మంత్రి మాట్లాడటాన్ని ఖండించారు. దళితులు అన్నివిధాలా అభివృద్ధి చెందారని, ఇప్పటికే 450 మంది దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్‌ క్యాడర్‌లో ఉన్నారని అప్పారావు పేర్కొన్నారు. వెంటనే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వెంటనే ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు