వృద్ధ దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు

1 Sep, 2016 23:33 IST|Sakshi
కుమార్తె, కుమారులు, బంధువులపైనా కేసులు
కాకినాడ రూరల్‌: కాకినాడ – సామర్లకోట రోడ్డులో నివాసం ఉంటున్న తెలుగుదేశంపార్టీ నగర మహిళ అధ్యక్షురాలు, జన్మభూమి కమిటీ సభ్యురాలు పలివెల లక్ష్మిరాజు తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  ఆగమేఘాలపై వారిని దహనం చేసిన తీరు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోందని లక్ష్మీరాజు బంధువలు కొందరు అర్బన్‌ వీఆర్వో పి. జగదీష్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయన టూ టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు.  వివరాల్లోకి వెళ్తే కాకినాడ–సామర్లకోట రోడ్డులోని ఐడియల్‌ కళాశాలకు కొద్ది దూరంలో రోడ్డు పక్కనే ఆక్రమిత స్థలాల్లో తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు పలివెల లక్ష్మీరాజు, ఆ ఇంటి సమీపంలోనే ఆమె తల్లిదండ్రులు మల్లెల సూర్యనారాయణ (65), మల్లెల హైమావతి (50) ఉంటున్నారు. రోడ్డు విస్తరణలో  లక్ష్మీరాజు ఇంటిని తొలగించడంతో ఆమె తల్లిదండ్రుల ఇంట్లోనే నివాసం ఉంటోంది. లక్ష్మీరాజు నిత్యం తల్లిదండ్రులను వేధించేదని, ఒక్కొక్కసారి చేయి కూడా చేసుకొనేదని, దాంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం రాత్రి 9.30 – 10 గంటల మధ్య ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేసరికి మృతదేహాలను కాకినాడ శ్మశాన వాటికకు తరలించినట్టు తెలుసుకొని అక్కడకు వెళ్లారు. అప్పటికే సూర్యనారాయణ, హైమావతిల దహన క్రియలను లక్ష్మిరాజు, ఆమె సోదరులు పూర్తి చేసేశారు. అక్కడే పోలీసులు లక్ష్మీరాజు, ఆమె  సోదరులు, బంధువుల నుంచి సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. వీఆర్వో జగదీష్‌ ఇచ్చిన సమాచారం మేరకు పలివెల లక్ష్మీరాజు, ఆమె ముగ్గురు అన్నదమ్ములపైన, ఆమె బంధువుల కొందరిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు టూ టౌన్‌ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. 
మరిన్ని వార్తలు