టౌన్‌ప్లానింగ్‌లో పేరుకుపోతున్న కేసులు

11 Aug, 2016 00:11 IST|Sakshi
టౌన్‌ప్లానింగ్‌లో పేరుకుపోతున్న కేసులు
 
  •  విధుల్లో చేరని ముగ్గురు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు
  •  ఉన్న వారిపైనే అధిక భారం
 
నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అధికారులకు పెండింగ్‌ కేసులు తలనొప్పిగా తయారయ్యాయి. నగరంలోని అనధికారిక, అక్రమ నిర్మాణల కూల్చివేతను చేపట్టిన అధికారులపై ఆయా భవన యజమానులు కోర్టును ఆశ్రయించారు. స్థలాలు, భవనాల విషయంలో ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 300కి పైగా కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కోర్టుకు కౌంటర్‌ను దాఖలు చేయాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానిక టీపీఎస్, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు చూస్తారు. ఫైళ్లను సమకూర్చి కోర్టుకు సమర్పించాలి. అయితే ఇటీవల మంత్రి నారాయణ ఆదేశాలతో ఏడుగురు టీపీఎస్‌లు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇతర జిల్లాల నుంచి ఏడుగురు తాత్కాలిక ఉద్యోగులను నియమించినా వారిలో ఏసీపీ గంగరాజు, ముగ్గురు టీపీఎస్‌లే విధుల్లో చేరారు. మరో ముగ్గురు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు విధుల్లో చేరలేదు. కృష్ణా పుష్కరాల అనంతరమే వారు విధుల్లో చేరతారని సమాచారం. దీంతో ఉన్న అధికారులపై భారం పడుతోంది.
కోర్టును ఆశ్రయించిన 70 మంది
కమిషనర్‌గా ఐఏఎస్‌ చక్రధర్‌బాబు ఉన్న సమయంలో మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేసేందుకు రోడ్డు విస్తరణకు రంగం సిద్ధం చేశారు. దీంతో శబరి శ్రీరామ క్షేత్రం వరకు రోడ్డు విస్తరణకు మార్కింగ్‌ చేశారు. దీంతో అప్పట్లో భవన యజమానులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి భవనాలకు సంబంధించిన సర్వే జరుగుతోంది. ఈ కేసులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్‌ అధికారుల్లేక కొన్ని భవనాల మంజూరుకు సంబంధించిన ఫైళ్లు సైతం పెండింగ్‌లో ఉన్నాయి.
 
>
మరిన్ని వార్తలు