నేటి నుంచి నగదు రహిత రేషన్‌ సరుకులు పంపిణీ

12 Dec, 2016 15:14 IST|Sakshi
నేటి నుంచి నగదు రహిత రేషన్‌ సరుకులు పంపిణీ
కార్డుదారుడు ఖాతాలో సొమ్ము లేకుంటే డీలర్‌ క్రెడిట్‌ కార్డుతో సరఫరా
జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ
పెద్దాపురం :చౌక ధరల దుకాణాల డీలర్లు నేటి నుంచి కార్డుదారులకు నగదు రహిత రేషన్‌  సరుకు సరఫరాకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌ లోని రేషన్‌  డీలర్లతో బుధవారం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నేటి నుంచి వినియోగదారులకు రూపే కార్డు ద్వారా నగదు రహితంగా సరుకులు అందజేయనున్నట్టు తెలిపారు. కార్డుదారుడు ఖాతాలో నగదు లేకపోతే డీలర్ల క్రెడిట్‌ కార్డుపై సరుకుల అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ కార్డుదారు నుంచి నగదును స్వీకరించకూడదని తెలిపారు. క్రెడిట్‌పై ఇచ్చిన సరుకుకు తరువాతి నెలలో కార్డుదారుడు బ్యాంక్‌ నిల్వ నుంచి డీలరు పొందాలని సూచించారు. డీలర్లు రానున్న రోజుల్లో బిజినెస్‌ కరస్పాండెంట్‌గా గ్రామాల్లో పని చేయాల్సి ఉంటుందని జేసీ అన్నారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల ప్రకారంగా రేషన్‌  డీలర్లు నగదు రహితంగా సరుకులు పంపిణీ చేయాలని, ఎటువంటి అపవాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  అనంతరం ఎఎస్‌వో పురుషోత్తమరావు నగదు రహిత రేషన్‌  సరుకుల పంపిణీపై డీలర్లకు శిక్షణ ఇచ్చారు. తహిసీల్దార్‌ జి.వరహాలయ్య, ఎంఎస్‌వో లక్ష్మికుమారి, రేషన్‌  డీలర్లు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు