నగదు కరువై..నిద్రకు వెలియై..!

22 Dec, 2016 00:00 IST|Sakshi
నగదు కరువై..నిద్రకు వెలియై..!
- రాత్రి పూటా ఏటీఎంల వద్ద పడిగాపులు
- 45 రోజులవుతున్నా మారని తీరు
- కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు..
 
కర్నూలు(అగ్రికల్చర్‌): పెద్దనోట్లు రద్దు చేసి ఇప్పటికి నెలన్నర రోజులు అవుతున్నా.. నగదు కష్టాలు తీరడం లేదు. వేలాది మంది పగలు పనులకు వెళ్తూ..రాత్రిళ్లు ఏటీఎంల దగ్గరు పడిగాపులు కాస్తూ నిద్రకు దూరం అవుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు..ఇతర అన్ని వర్గాల వారు ఉన్న డబ్బును బ్యాంకుల్లో దాచుకున్నారు. దాచుకున్న డబ్బును తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. జిల్లాలో బుధవారం స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్రాంచీలతో పాటు వివిధ బ్రాంచీల్లో నో క్యాష్‌ అంటూ బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని బ్యాంకుల్లో నగదు ఉన్నా ఇచ్చేది రూ.2వేల  నుంచి 6వేల వరకే. ఇప్పటికే నగదు కోసం క్యూలో నిలబడి అస్వస్థతకు గురై జిల్లాలో ఇద్దురు వృద్ధులు మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ లైన్‌లో గంటల తరబడి నిలబడలేక అస్వస్థతకు గురువుతున్న వారు అనేక మంది ఉన్నారు. 
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 34 బ్యాంకులకు 445 బ్రాంచీలు ఉన్నాయి. బుధవారం 375 బ్రాంచీల్లో నగదు లేదు. జిల్లా మొత్తంగా 485 ఏటీఎంలు ఉండగా బుధవారం 20 మాత్రమే పనిచేశాయి. వారంలో రూ.24వేలు తీసుకునే అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించినా.. నగదు కొరతతో రూ.4000 కూడా తీసుకోలేకపోతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థిథఙఅధ్వానంగా ఉంది. సగటు జీవి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజల దగ్గర ఉన్న డబ్బు 8వేల కోట్లు ఇప్పటి వరకు డిపాజిట్లుగా బ్యాంకులకు వచ్చాయి. జిల్లాకు వచ్చిన కొత్త కరెన్సీ రూ. 1000 కోట్లకు మించలేదు.  
మరిన్ని వార్తలు