మళ్లీ మొదటికి...

7 Jul, 2017 03:21 IST|Sakshi

నగదు కొరతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి
ఏటీఎంల చుట్టూ చక్కర్లు  
శని, ఆదివారాల్లో జిల్లాలోని బ్యాంకులకు అందనున్న డబ్బు


కడప అగ్రికల్చర్‌:
నగదు కొరత మళ్లీ వేధిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఏటీఎంలు,  బ్యాంకుల్లో డబ్బు సులభంగా తీసుకోవడానికి వీలుండేది. ఇప్పుడా పరిస్థితి లేదని ఖాతాదారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నగదు సమస్య నెలకొంది. నగరంలోని మెజార్టీ ఏటీఎం కేంద్రాలకు వెళ్లి కార్డు మిషన్‌లో పెట్టి చూస్తే డబ్బుల్లేవ్‌ అనే సమాచారమే వస్తోంది.   పెద్దనోట్లు రద్దు చేసి ఇప్పటికి 226 రోజులు గడచింది. నిన్న మొన్నటి వరకు నగదు కొరత తీరిందనిపించినా...పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం, కొన్ని ఏటీఎంల వద్ద అవుటాఫ్‌ సర్వీసు బోర్డులు  కనిపిస్తుండడం అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

మొన్నటి వరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ వారానికి రూ.24 వేలు మాత్రమే ఉండేది, ప్రస్తుతం రోజుకు రూ.40 వేలకు పెంచారు. అయితే బ్యాంకుల్లో, ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో విత్‌డ్రా పరిమితిని పెంచినా ఉపయోగం ఏమిటని ఖాతాదారుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాకు సంబంధించి ఆంధ్రా బ్యాంకు, ఎస్‌బీఐలకు ఆర్‌బీఐ కరెన్సీ చెస్ట్‌లున్నాయి. ప్రైవేట్‌ రంగంలోని బ్యాంకుల్లో  డబ్బులు కొంతమేర లభ్యమవుతున్నా ఎస్‌బీఐ, సిండికెట్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో లావాదేవీలు నిలిచిపోతున్నాయి.  నగదు చెల్లించడానికి ఎవరైనా వెళితే వారిని క్యూలో నుంచి ముందుకు పిలిచి డబ్బులు తీసుకుని, దానిని మళ్లీ విత్‌డ్రా చేసుకునే వారికి ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జిల్లాలో 357 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి.  ప్రభుత్వ రంగ ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. నగదు రహిత లావాదేవీలంటూ మొదట హడావిడి చేసినా జిల్లా యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టింది. ఈ పరిస్థితి కూడా నగదు కొరతకు కారణమవుతోంది.  రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా  ప్రతి వారం సక్రమంగా నగదు సరఫరా చేయడం లేదని  బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. దాదాపు 10–15 రోజులుగా డబ్బు రావడం లేదని  అన్నారు.  

ప్రధాన బ్యాంకుల్లో నగదు కొరత: ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచీతోపాటు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్, సిండికెట్‌ బ్యాంకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కెనరా బ్యాంకు, ఏపీజీబీల్లో నగదు సమస్య ఏర్పడినట్లు సమాచారం. జిల్లాలోని 33 బ్యాంకులకుగాను 380 బ్రాంచీలు ఉన్నాయి.   విత్‌డ్రా కోసం వచ్చే ఖాతాదారులు నగదు లేదని తెలిసి నిరాశతో వెనుదిరుగుతున్నారు.   

శని, ఆదివారాల్లో జిల్లాకు నగదు
ఆర్‌బీఐ నుంచి నగదు సరఫరా ఉంది. ప్రధాన కారణమేమంటే పాతనోట్లు ఆర్‌బీఐ తీసుకుని కొత్తవి ఇచ్చే విషయంలో టెక్నికల్‌ సమస్య ఉన్నట్లు సమాచారం. దీనిని అధిగమించి   శని, ఆదివారాల్లో ఆర్‌బీఐ జిల్లాకు డబ్బు పంపుతున్నట్లు తెలిసింది. ఖాతాదారులు ఆందోళన  చెందాల్సిన అవసరం లేదని ఓ బ్యాంకు అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు