నగదు రహితం..వేదనా భరితం

6 Mar, 2017 01:12 IST|Sakshi
నగదు రహితం..వేదనా భరితం
= సామర్థ్యం లేని సర్వర్‌తో ఇక్కట్లు
= జిల్లావ్యాప్తంగా చౌకదుకాణాల్లో సమస్య
= సరుకుల పంపిణీ చేయలేమన్న డీలర్లు 
= రేషన్‌ అందక జనం అష్టకష్టాలు
 
అనంతపురం అర్బన్ : చౌకధరల దుకాణాల్లో నగదు రహితంపై రేషన్ సరుకుల పంపిణీ కష్టసాధ్యమవుతోంది. పంపిణీ ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడం లేదు. లీడ్‌ బ్యాంక్‌గా ఉన్న సిండికేట్‌ బ్యాంక్‌ ‘గేట్‌వే’తో కొన్ని బ్యాంకులు లింక్‌ కావడం లేదు. అత్యధిక బ్రాంచ్‌లున్న ఏపీజీబీ (ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌) సంబంధించిన సర్వర్‌ సామర్థ్యం తక్కువ ఉండడంతో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇటు చౌకడిపో డీలర్లు, అటు రేషన్ కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు. 
 
గేట్‌వే లింక్‌.. సర్వర్‌ సమస్య
జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఏపీజీబీకి సంబంధించి అత్యధికంగా 120 బ్రాంచ్‌లు ఉన్నాయి. అధిక సంఖ్యలో కార్డుదారులకు ఈ బ్రాంచ్‌ల్లోనే ఖాతాలు ఉన్నాయి. అయితే ఏపీజీబీకి ప్రస్తుతం ఉన్న సర్వర్‌ సామర్థ్యం తక్కువగా ఉండడంతో సమస్య అధికమైంది. జిల్లాకు లీడ్‌ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న సిండికేట్‌ బ్యాంక్‌కు కర్ణాటక బ్యాంక్, కోటక్‌ మహీంద్రా, ఏడీసీసీ బ్యాంకుల లింక్‌ లేకపోవడంతో గేట్‌వేలోకి వెళ్లడం లేదు. ఇదో పెద్ద సమస్యగా మారినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా సరిహద్దుగా, కర్ణాటక సమీపంలో ఉన్న గ్రామాల్లోని కార్డుదారులకు కర్ణాటక, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ బ్రాంచీల్లో ఖాతాలు ఉన్నాయని చెబుతున్నారు. గేట్‌వే లేకపోవడంతో ఆ బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్న కార్డుదారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించలేక పోతున్నారని తెలిపారు.
 
అమలు చేయలేమంటున్న డీలర్లు
సర్వర్‌ సమస్య కారణంగా నగదురహితంపై సరుకులు పంపిణీ చేయలేమని జిల్లా సరఫరాల శాఖ అధికారి (డీఎస్‌ఓ) శివశంకర్‌రెడ్డికి చౌకడిపో డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరావిురెడ్డి ఆధ్వర్యంలో డీలర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ–పాస్‌ యంత్రాలు నగదురహిత విధానాన్ని స్వీకరించడం లేదని చెప్పారు. నగదురహితానికి ఒక్కొక్క కార్డుదారుని 20 నిమిషాలకు పైగా సమయం పడుతోందని, అయినా కూడా డిక్లెయిన్ అని వస్తోందని అంటున్నారు. రోజుకు 20 మందికి కూడా సరుకులు ఇవ్వలేక పోతున్నామంటున్నారు. దీంతో కార్డుదారులు తమను ఇష్టానుసారంగా దూషిస్తున్నారంటూ వాపోయారు. 
 
పంపిణీ అంతంత మాత్రమే
నగదురహిత లావాదేవీల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ జిల్లావ్యాప్తంగా అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉండగా... అధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి సరుకులు తీసుకునేందుకు చౌక ధరల దుకాణాలకు 2,30,965 మంది కార్డుదారులు వెళ్లారు. అయితే 48,219 మంది కార్డుదారులకు మాత్రమే నగదురహితంగా సరుకులు అందాయి. దీన్నిబట్టి చూస్తే ప్రక్రియ అమలు తీరు ఎంత అధ్వానంగా సాగుతోందో స్పష్టమవుతోంది.  
మరిన్ని వార్తలు