రేషన్‌ దుకాణాల్లో నగదు రహితం తప్పనిసరికాదు

12 Apr, 2017 23:28 IST|Sakshi
రేషన్‌ దుకాణాల్లో నగదు రహితం తప్పనిసరికాదు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి
కాకినాడ సిటీ: రేషన్‌ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు తప్పని సరికాదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌ విధాన గౌతమి సమావేశ హాలులో పౌర సరఫరాల శాఖ సమీక్షా సమావేశం ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. ప్రత్తిపాటి ముఖ్య అతిథిగాను, రవాణా, బీసీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళిశాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సమావేశంలో తొలుత జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ మంత్రులకు స్వాగతం పలికి, పౌరసరఫరా కార్యక్రమాలు, రైతులకు మద్దతు ధర కల్పన, దీపం గ్యాస్‌ కనెక‌్షన్ల పంపిణీ తదితర అంశాలు జిల్లాలో అమలు ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ రేషన్‌షాపుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రజల ఇష్టం మేరకే నిర్వహించాలని, బలవతం చేసి ఇబ్బందులకు గురి చేయవద్దని పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా లాటరీ ద్వారా ఒకరికి రూ.లక్ష బహుమతి, రూ.5 వేలు విలువైన స్మార్ట్‌ఫోన్‌లు బహుమతిగా అందజేస్తున్నామని, ఆసక్తి కలిగిన వారందరూ నగదు రహిత లావాదేవీల్లో పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు.  
బీసీ వర్గాల సంక్షేమానికి కృషి...
 రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళి శాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చేతివృత్తుల వారికి అధునాతన పనిముట్లుపై శిక్షణ కల్పించి, వాటిని పంపిణీ చేస్తామన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చి దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. 
ఆహార సలహా కమిటీల ఏర్పాటు...
 ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ కోసం అన్ని స్థాయిల్లోని ఆహార సలహా కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలను తరచుగా నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ బియ్యం ధరల నియంత్రణ లేదని, సన్నబియ్యం కేజీ రూ.50కి అమ్మతున్నారు.  ఈ సమావేశంలో కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా