కోతికి కొత్త ఉపాయం..!

29 Nov, 2015 22:43 IST|Sakshi
కోతికి కొత్త ఉపాయం..!

* వానరాన్ని పట్టిస్తే రూ.400 నజరానా
* మానుకోట మునిసిపాలిటీలో అమలు
* నెల రోజులుగా 926 కోతుల పట్టివేత
* భద్రాచలం అడవులకు తరలింపు

వరంగల్: జనజీవనానికి ఇబ్బందులు కలిగిస్తున్న కోతులను ఎదుర్కొనేందుకు వరంగల్ జిల్లా మహబూబాబాద్ మునిసిపాలిటీ కొత్త ఉపాయం ఆలోచించింది. కోతులను నివారించే విషయంలో సెంటిమెంట్‌లను గౌరవిస్తూనే వీటి బెడదను తగ్గించే చర్యలు చేపట్టింది. కోతుల సమస్యపై పట్టణవాసుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో శాశ్వతంగా వీటి నివారణ చర్యలు అమలు చేస్తోంది. ఒక కోతిని పట్టుకుంటే రూ.400 చెల్లించాలని నిర్ణయించింది. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన 10 కుటుంబాల వారు ఇప్పుడు కోతులను పట్టే పనిలో పూర్తి నిమగ్నమయ్యారు.

అక్టోబరు 29న కోతులు పట్టడం మొదలైంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. 'నెల రోజుల్లో మా బృందం 926 కోతులను పట్టి అడవుల్లో వదిలిపెట్టాం' అని కోతులను పట్టే బృందం నాయకుడు శివయ్య తెలిపారు. కోతులను పట్టుకోవడం కోసం వీరు 20 బోన్లను వినియోగిస్తున్నారు. కోతుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బోన్‌లను అమర్చి తినే పదార్థాలను పెట్టి వాటిని పడుతున్నారు. పట్టుకున్న కోతులను అడవుల్లో వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పట్టణవాసులకు ఇబ్బందిగా ఉన్న కుక్కల నివారణలోనూ మునిసిపాలిటీ చర్యలు తీసుకుంటోంది. ఒక కుక్కను చంపితే రూ.100 చొప్పున నజరానా ఇస్తోంది. ఇప్పటికే 366 వీధి కుక్కలను చంపి పట్టణానికి దూరంగా పడవేశారు. తాజాగా, కుక్కలను చంపకుండా ఇంజక్షన్‌లు ఇచ్చి పునరుత్పత్తి కాకుండా చికిత్సలు చేయిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు