మార్కెట్‌ యార్డులో సీబీఐ విచారణ

30 Jul, 2016 17:58 IST|Sakshi
మార్కెట్‌ యార్డులో సీబీఐ విచారణ
గుంటూరు : గుంటూరు మార్కెట్‌ యార్డులో గత ఏడాది జరిగిన పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, అవకతవకలకు సంబంధించి చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు వీలుగా దర్యాప్తును ముమ్మరం చేశారు. శుక్రవారం సీబీఐ అధికారులు గుంటూరు మిర్చి యార్డులో పలు వివరాలు సేకరించారు. అధికారులు, సిబ్బంది నుంచి పలు ఫైళ్లు తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. దీంతో పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరూ ఏ క్షణంలో ఏం ముంచుకొస్తుందోనని బెంబేలెత్తుతున్నారు. అక్రమాలకు మూలకారణమైన సీసీఐ బయ్యర్ల ఇళ్లపైనే ప్రధానంగా సీబీఐ గతంలో దాడులు నిర్వహించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అమరావతి మండలం లింగాపురం, క్రోసూరు, పొన్నూరు, పెదనందిపాడు, పిడుగురాళ్ల, మైలవరం, కుక్కునూరు, నందిగామ వ్యవసాయ కమిటీల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ ఇంతకుముందు దృష్టి పెట్టింది. అంతకంటే కిందిస్థాయి సిబ్బందిని కూడా విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని సీబీఐ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీసీఐ బయ్యర్లకు సహాయకులుగా ఉన్న అసిస్టెంట్లతో పాటు మార్కెటింగ్‌ శాఖకు సంబంధించి వేమెన్లను కూడా విచారించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసుకుంటోంది. గుంటూరు మార్కెట్‌ యార్డులో కింది స్థాయి అధికారులను శుక్రవారం విచారించినట్లు సమాచారం. 
 
మరిన్ని వార్తలు