అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి

1 Jan, 2017 23:21 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : జిల్లాలో 2016లో చేపట్టిన ప్రభుత్వ పథకాల్లో పెద్దఎత్తున అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిందని, దానిపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ జిల్లా నాయకులతో కలిసి మాట్లాడారు. గతేడాది జరిగిన నీరు–చెట్టు, హరిత వనం, గాలిమరలు, సోలార్‌ ప్లాంట్, ఇసుక విక్రయాలు, తదితర పథకాల్లో రూ.వందల కోట్లు అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫారంపాండ్లు, రెయిన్‌గన్లు, రక్షక తడుల పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ అయ్యిందన్నారు.

దీనిపై జిల్లా యంత్రాగమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి 80 శాతం ఉన్నట్లు స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించారన్నారు. ఇందులో అధికార పార్టీ నాయకులే అవినీతిని అధిక శాతం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సి.మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు కాటమయ్య, ఎస్‌.నాగరాజు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు