హవాలాపై సీబీ‘ఐ’

26 May, 2017 01:48 IST|Sakshi
నరసాపురం :  విశాఖ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం గురువారం నరసాపురంలో దాడులు జరిపింది. పట్టణంలో పేరుమోసిన బంగారం వ్యాపారి దుకాణం, ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిం చింది. వేకువజాము నుంచి రాత్రి 7 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. దాడుల విషయాన్ని సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. సీబీఐ డీఎస్పీ, మరో 9మంది సిబ్బంది వేకువజామునే నరసాపురం చేరుకుని, వాహనాలను గోదావరి గట్టు సమీపంలో పార్కింగ్‌ చేశారు. ఉదయం 5 గంటల సమయంలో కాలినడకన అతని ఇంటికి చేరుకున్నారు. కొందరు ఇంట్లో, మరికొందరు అతడి జ్యూయలరీ షాపులో సోదాలు చేశారు. స్థానిక పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. సోదాలు పూర్తయిన తర్వాత గాని ఇక్కడకు వచ్చింది సీబీఐ అధికారులన్న విషయం తెలియలేదు. 
 
హవాలా కేసులో భాగంగానే..
ఇటీవల విశాఖలో వెలుగు చూసిన రూ.1,300 కోట్ల హవాలా కుంభకోణానికి సంబంధించిన కేసులో భాగంగానే సీబీఐ అధికారులు సోదాలు చేసినట్టు తెలిసింది. హవాలా కేసుకు సంబంధించి వడ్డి మహేష్, అతని స్నేహితుడు శ్రీనివాస్‌ను ఇటీవల విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఇదే కేసులో మరో ఇద్దరిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉన్నట్టు దర్యాప్తులో తేల్చారు. అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్న సందర్భంగా వారిచి్చన సమాచారంతో నరసాపురంలో కూడా దాడులు చేసినట్టు సమాచారం. ఈ కేసులో రూ.650 కోట్ల మేర హవాలా లావాదేవీలు సాగి నట్టు ముందుగా విశాఖ పోలీసులు తేల్చారు. అయితే ఈ మొత్తం రూ.1,300 కోట్ల మేర ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సీబీసీఐడీ పర్యవేక్షిస్తున్న ఈ కుంభకోణం కేసు వ్యవహారం రూ.వందల కోట్లలో ఉండటంతో సీబీఐ అధి కారులు రంగప్రవేశం చేసినట్టు భావిస్తున్నారు. సోదాల సందర్భంగా కీలక వివరాలు సేకరించిన అధికారులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు వారు ఏ కేసుకు సంబంధించి వచ్చారు, ఎవరెవరిని విచారించారనే విషయాలు వెల్లడించ లేదు. మొత్తానికి వందలాది కోట్ల రూపాయల హవాలా కేసు వ్యవహారం విశాఖ నుంచి నరసాపురం చేరింది. సీబీఐ  దాడులు పట్టణంలో సంచలనం రేకెత్తించాయి. ముఖ్యంగా బులియన్‌ వ్యాపారులు హడలిపోయారు. 
 

 

మరిన్ని వార్తలు