'మహాత్మాగాంధీ' డబ్బులు పోస్ట్మాస్టర్ స్వాహా

14 Jan, 2016 16:16 IST|Sakshi

శ్రీకాకుళం‌: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు చెందాల్సిన మొత్తాన్ని అక్రమ మార్గాల్లో కొల్లగొట్టిన పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. వారు అక్రమంగా వెనకేసిన మొత్తం రూపాయో రెండు రూపాయలో కాదు.. ఏకంగా 1.53 కోట్లు.

సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సతివాడ పోస్ట్ ఆఫీసుకు చెందిన ఓ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇతర ముగ్గురు తపాళా శాఖ అధికారులు 26.10.2013 నుంచి 09.09.2015 మధ్య కుట్రపూరితంగా వ్యవహరించి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన వారికి చెల్లించాల్సిన మొత్తంలో మోసం చేసి దాదాపు కోటిన్నరకు పైగా వెనకేసుకున్నారు. దీంతో గత కొంత కాలంగా వీరిని అనుమానించిన సీబీఐ అధికారులు తాజాగా వారిపై కేసులు పెట్టి వారి వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వీరి ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు