కళాశాలలపై నిఘా

16 Apr, 2016 05:02 IST|Sakshi
కళాశాలలపై నిఘా

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లు
నూతన విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి

 సాక్షి, హైదరాబాద్ :  ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరింత గాడిలోకి రానున్నాయి. బోధనలో పారదర్శకత తీసుకరావడం, హాజరు శాతం పెంచడానికి ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 23, రంగారెడ్డిలోని 26 ప్రభుత్వ కళాశాలల్లో చాలా వరకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కళాశాలకు నాలుగు చొప్పున బిగించారు. నెల రోజుల నుంచి సాగుతున్న ఈ ఏర్పాటు ప్రక్రియ మరో నాలుగైదు రోజుల్లో ముగియనుంది. కళాశాల ప్రాంగణం, స్టాఫ్ రూంలో ఒకటి చొప్పున, తరగతి గదులలో రెండు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలన్నీ నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డుకు అనుసంధానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, లెక్చరర్ల రాకపోకలపై కన్నేయడంతోపాటు..

భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సరైన బోధన అందించడంతోపాటు విద్యార్థులు, లెక్చరర్ల కదలికలు తెలుసుకునేందుకు ఈ చర్యకు శ్రీకారం చుట్టారు. అంతేగాక నగర శివార్లలోని చాలా కళాశాలలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారిన విషయం తెలిసిందే. మద్యం అక్కడే తాగడంతో పాటు కళాశాలలకు సంబంధించిన ఆస్తులను మద్యం మత్తులో ధ్వంసం చేస్తున్నారు. విలువైన వస్తువులు కూడా చోరీకి గురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటే శరణ్యమని భావించిన ప్రభుత్వం.. చర్యలకు ఉపక్రమించింది. గతేడాది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు ప్రభుత్వ కళాశాలల్లో కెమెరాలు బిగించారు. ఒకటి నిజామాబాద్ జిల్లాలోకాగా.. మరొకటి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో మార్పు రావడంతో.. ప్రతి కళాశాలలో ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. జూన్ రెండో వరకు అన్ని కళాశాలల్లో కెమెరాలు అందుబాటులోకి వస్తాయని రంగారెడ్డి జిల్లా ఆర్‌ఐఓ -2 హన్మంత్ రెడ్డి తెలిపారు.

 బయోమెట్రిక్ విధానంలో హాజరు..
కళాశాలల్లో ఇప్పటి వరకు విద్యార్థుల హాజరును రికార్డుల్లో రోజువారీగా నమోదు చేసేవారు. ఇకపై ఇటువంటి పరిస్థితి కనిపించదు. రికార్డులతో పని లేకుండా వేలి ముద్ర ల (బయోమెట్రిక్) ద్వారా తీసుకోనున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో కళాశాలకు గరిష్టంగా రెండు బయోమెట్రిక్ డి వైస్‌లు ప్రభుత్వం నుంచి అందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులతోపాటు లెక్చరర్లు కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు శాతం పెంచడంతోపాటు.. లెక్చరర్ల రాకపోకల సమయాలను తెలుసుకునేందుకు ఈ చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. జూన్ ఒకటో తేదీ నాటికి బయోమెట్రిక్ మిషన్‌లను కళాశాలల్లో అందుబాటులోకి రానున్నాయి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా