ఎఫ్‌సీఐలో సంబరాలు

7 Aug, 2016 22:15 IST|Sakshi
జ్యోతినగర్‌: ప్రధాని నరేంద్రమోడీ గజ్వేల్‌లో మిషన్‌కాకతీయ పైలాన్, రామగుండం ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేయడంతో ఎఫ్‌సీఐ మాజీ ఉద్యోగులు, కాంట్రాక్టు క్యాజువల్‌ లేబర్, స్థానిక నిరుద్యోగ యువత, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల యువత బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎం.సుందర్‌రాజు, డి.పోశంయాదవ్, బొడ్డుపల్లి నారాయణ మాట్లాడుతూ ఎరువుల కర్మాగారం గ్యాస్‌ ఆధారితంగా రోజుకు 3850 టన్నుల యూరియా, 200 టన్నుల అమ్మోనియా తయారు చేస్తుందన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్‌కుమార్, కేంద్ర సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కృషి చేశారని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు పర్మినెంట్‌ ఉపాధి కల్పించాలని, కాంట్రాక్టు క్యాజువల్‌ లేబర్‌ కుటుంబాల పిల్లలకు అర్హతలను బట్టి పర్మినెంట్, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆసిఫ్‌పాషా, రాంబాబు, ప్రతాప్, భూంరావు, మల్లేష్‌తో పాటు కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు