చుక్కల్లో సిమెంటు ధరలు..!

9 Sep, 2016 19:22 IST|Sakshi
చుక్కల్లో సిమెంటు ధరలు..!

– నెల రోజుల్లో సిమెంటు బస్తాకు రూ. 40 నుంచి రూ. 50 పెరుగుదల
– ఆందోళనలో గృహ నిర్మాణదారులు

మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది గృహ నిర్మాణ దారుల పరిస్థితి. అసలే అత్తెసరు వేతనాలతో అవస్థలు పడుతున్న వారిని పెరుగుతున్న సిమెంట్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నెల వ్యవధిలో సిమెంట్‌ బస్తా ధర 20 నుంచి 25 శాతం పెరగడంతో ఇంటి నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోందని వినియోగదారులు వాపోతున్నారు.
పులివెందుల రూరల్‌ : రోజు రోజుకు సిమెంటు ధరలు పెరుగుతూ వినియోగదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సిమెంట్‌ కంపెనీలు మూకుమ్మడిగా ధరలు పెంచుతుండడంతో గృహ నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. నెల వ్యవధిలో సిమెంటు బస్తా ధర రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగింది.
నెలలో భారీగా పెరిగిన ధరలు
 గతనెల మొదటి వారంలో బస్తా ధర రూ. 260 నుంచి రూ. 270 ఉండగా.. అది పెరిగి రూ. 300 నుంచి రూ. 330కి చేరింది. దీంతో గృహ నిర్మాణదారులు తీవ్ర ఆందోళన చెందారు. తిరిగి కంపెనీలు సిమెంటు ధరలను ఆగస్ట్‌ చివరి వారంలో మరోసారి పెంచడంతో నిర్మాణదారులు ఖంగుతిన్నారు. ప్రస్తుతం సిమెంటు ధర రూ.360 వరకు పలుకుతోంది. కంపెనీ రకాలను బట్టి డీలర్లు వివిధ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా ఇష్టానుసారం సిమెంటు ధరలు పెంచుకుంటూ పోతే ఇళ్లు నిర్మించుకోలేమని సామాన్యులు వాపోతున్నారు.
జిల్లాలో 5 ఫ్యాక్టరీలున్నా ప్రయోజనం శూన్యం
జిల్లాలో ఐదు ప్రముఖ సిమెంటు ఫ్యాక్టరీలున్నాయి. అయినా వినియోగదారులకు ప్రయోజనం ఉండడం లేదు. జిల్లాలో రవాణా ఖర్చులు లేకున్నా ధరలు పెరుగుతుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో తయారైన వాటికి ట్రాన్స్‌పోర్ట్, ఇతర ఖర్చుల ఆధారంగా ధరలు చెల్లించాలి. జిల్లాలో ఫ్యాక్టరీలు ఉండి  కనీసం స్థానికంగా కూడా సిమెంటు ధరల నియంత్రణ లేకపోవడం తీవ్ర అన్యాయమని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని సిమెంటు ధరలు తగ్గించాలని కోరుతున్నారు.

 

మరిన్ని వార్తలు