భగ్గుమంటోన్న కేంద్ర ఉద్యోగులు

26 Jul, 2016 20:15 IST|Sakshi
విధుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
 
– వేతనాలపై గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
– ప్రస్తుతం పెరిగింది బేసిక్‌ పే మాత్రమే
– హెచ్‌ఆర్‌ఏపై ఇంకా స్పష్టత కరువే 
– అధికారుల చేతుల్లో ఉద్యోగుల భవిష్యత్తు 
– 20 ఏళ్లలో ఎంఏసీపీ లేకుంటే ఇంక్రిమెంట్‌ కష్టమే
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి : 
ఉద్యోగుల వేతనాల పెంపుపై కేంద్రం తాజాగా విడుదల చేసిన సెవెన్త్‌ పే కమిషన్‌ అమలుకు చెందిన అధికారిక గజిట్‌ నోటిఫికేషన్‌పై కేంద్ర ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో వేతన పెంపునకు సంబంధించిన కీలకాంశాలను చూసి విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపుదల ఎంత మాత్రం ఉద్యోగుల ప్రయోజనాల మేరకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం...ప్రస్తుతం పెరిగింది బేసిక్‌ పే మాత్రమే. ఇది కూడా 2.57 రెట్లు మాత్రమే. ఉద్యోగ సంఘాలు అడిగిన 3.5 రెట్ల ఫిట్‌మెంట్‌ ఫార్ములాకు ఎంతమాత్రం ఒప్పుకోని కేంద్రం చివరకు 2.57 రెట్ల బేసిక్‌ పేకు మాత్రం సమ్మతించింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్‌లో ఎక్కడా హెచ్‌ఆర్‌ఏ గురించి ప్రస్తావించలేదు. గతంలో చెప్పినట్లు ఉద్యోగుల పాత బేసిక్‌ పే మీద 20 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించేందుకు మాత్రమే కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవంగా ఏడో వేతన సంఘం వేతన సవరణ ప్రకారం పెరిగిన బేసిక్‌ పే మీద 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకటించాల్సి ఉంది. అయితే పాత బేసిక్‌ పే మీద 20 శాతం చెల్లింపుల పైనే కేంద్రం యోచిస్తున్నట్లు తాజా నోటిఫికేషన్‌ తెలియజేస్తోంది. ఉదాహరణకు రూ.16490ల పే స్కేలున్న ఉద్యోగి ప్రస్తుతం 20 శాతం హెచ్‌ఆర్‌ఏ కింద రూ.3298 తీసుకుంటున్నాడు. ఏడో వేతన సవరణలో భాగంగా (2.57 రెట్లు పెంచితే) భాగంగా ఈయన బేసిక్‌ పే రూ.42 వేలకు చేరుతుంది. ఉద్యోగులు అడుగుతున్నట్లు ఈ బేసిక్‌ పే మీద కేంద్రం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులు అడిగిన 20 శాతం కాకుండా కేంద్రం ఇస్తానన్న 16 శాతం లెక్కన ఉద్యోగికి కొత్త హెచ్‌ఆర్‌ఏ రూ.6848 అందాల్సి ఉంది. అయితే కేంద్ర మాత్రం పాత పేస్కేలు మీద అప్పట్లో ఇచ్చినట్లు 20 శాతమే ఇస్తానంటోంది. దీనివల్ల ఉద్యోగి నెలకు రూ.3 వేలకు పైగా నష్టపోయే అవకాశముంది. ఎరియర్స్‌ రూపేణా కూడా ఆరు నెలలకు రూ.18 వేల వరకూ నష్టమే.
 
ఉద్యోగుల భవిష్యత్తు మొత్తం పై అధికారుల చేతుల్లోనే...
 
దీనికితోడు పదోన్నతుల విషయంలో విధించిన షరతులు ఉద్యోగులను తీవ్రంగా నష్టపరిచేవిగా ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు 10,20,30 ఏళ్లకోసారి ఇంక్రిమెంట్‌తో కూడిన మోడిఫైడ్‌ ఎష్యూర్‌ కెరియర్‌ ప్రోగ్రెషన్‌ (ఎంఏసీపీ) పదోన్నతిని కల్పిస్తున్నారు. ఉద్యోగుల చివరి ఐదేళ్ల సర్వీసు కాలంలో మూడేళ్లపాటు సదరు ఉద్యోగి  పనితీరు ‘గుడ్‌’ అయితేనే ఈ ప్రమోషన్‌ లభిస్తుంది. ఇకపై వెరీగుడ్‌ అని సర్వీసు రికార్డులో నమోదైతేనే ప్రమోషన్‌ లభిస్తుంది. లేకపోతే కష్టమే. 20 ఏళ్ల సర్వీసులోగా ఎంఏసీపీ అందుకోకపోతే భవిష్యత్తులో ఇంక్రిమెంటు కూడా రాదని తాజా నోటిఫికేషన్‌ తెలియజేస్తోంది. ఈ విధంగానైతే ఉద్యోగుల భవిష్యత్తు మొత్తం అధికారుల చేతుల్లోకి వెళ్లి భవిష్యత్తు ఇబ్బందికరంగా మారే ప్రమాదముందని ఉద్యోగ సంఘ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ)విషయంలో బేస్‌ ఇయర్‌ను 1.1.2016 గా మార్చారు. దీనివల్ల కొత్తగా డీఏ శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఉద్యోగ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
 
మరిన్ని వార్తలు