దీపం ఉండగానే.. దోచుకో.. దాచుకో..

13 May, 2016 08:50 IST|Sakshi

సెంట్రల్ జోన్ తీరూతెన్నూ
ఇసుక నుంచి పేకాట వరకు అన్నింటా మామూళ్లే
నిత్యం సెటిట్‌మెంట్లతో శివారు స్టేషన్ బిజీబిజీ
కాసులకు కక్కుర్తిపడి కేసులు కట్టని మరో స్టేషన్ అధికారి
 
విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అధిక ఆదాయ వనరులు ఉండే జోన్.. సెంట్రల్. కొత్తగా ఏర్పడినా.. ఏసీపీని నియమించినా ఇక్కడి స్టేషన్లు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది మాత్రం పూర్తిగా పాతవారే. దీంతో ఇక్కడ సెటిల్‌మెంట్లు, వ్యవహారాలు ఇష్టానుసారంగా సాగుతున్నాయి. భూగర్భ సంపద దోపిడీ మొదలుకొని రియల్ ఎస్టేట్ దందాలు, వ్యభిచార ముఠాల వరకు అన్నీ ఇక్కడ నిత్యకృత్యం.
 
విజయవాడ : పోలీసు కమిషనరేట్‌లోని సెంట్రల్ జోన్‌లో ఒక్కొక్క అధికారిది ఒక్కో తీరు. కేసులను డీల్ చేసే విధానంలోనే తేడా ఉంటుంది తప్ప ధనార్జన, రాజకీయ సిఫార్సుల విషయంలో మాత్రం దాదాపు అందరూ ఒక్కటే! రాష్ట్రంలోనే సంచలనంగా మారి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ వ్యవహారానికి సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నమోదయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ధోరణిలో కొందరు అధికారులు ఉండటం గమనార్హం.
 
శివారు స్టేషన్‌లో దందాలు షురూ...
నగర శివారులో ఉన్న పోలీస్‌స్టేషన్ నిత్యం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే సదరు స్టేషన్ సీఐ పనితీరు బాగోలేదని, అవినీతి ఆరోపణలు ఉన్నాయనే కారణంగా ఏలూరు రేంజ్‌కు సరెండర్ చేశారు. అయినా అధికార పార్టీ ఆధిపత్యంతో ఈ వ్యవహారాలు నిత్యకృత్యంగానే సాగుతున్నాయి. ముఖ్యంగా తాడిగడప, వణుకూరు, చౌడవరం గ్రామాల్లోని అపార్ట్‌మెంట్లు, తోటలు, నది ఒడ్డున అధికార పార్టీ నేతలు లక్షల్లో నిర్వహించే పేకాట శిబిరాలు కొనసాగుతూనే ఉన్నాయి.
 
రియల్ దందాలపై ఫిర్యాదులు అనేకం వస్తున్నా కేసుల దాకా రానీయని పరిస్థితి. కొన్నింటిని పోలీసులు, మరికొన్ని సందర్భాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు సెటిల్‌మెంట్లు చేస్తుంటారు. ఇక ఇసుక దందాకు అడ్డే లేదు. ప్రజాప్రతినిధి అనుచరులు రోజుకు రూ.5 లక్షలు విలువ చేసే ఇసుకను నాలుగు నెలల పాటు తవ్వారు. నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ఆరు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వినా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. ఇక స్టేషన్ పరిధిలోని బార్లు, వైన్ షాపుల నుంచి నెలవారీలు షరా మామూలే. ఒక్కొక్క బార్ నుంచి రూ.18 వేలు, వైన్ షాపు నుంచి రూ.16 వేలు వసూలు చేస్తారు.
 
పంచాయితీలతో బిజీబిజీ...
ఆటోనగర్ పంచాయితీలతో మరో స్టేషన్ బిజీబిజీగా ఉంటుంది. కేసులు అతి తక్కువగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నిత్యం పాత ఇనుప మాయం, దొంగ రవాణా, వ్యాపారుల మధ్య వివాదాలు ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉన్నా కేసుల దాకా రానివ్వకుండా ప్రత్యేక ధరలతో సెటిల్‌మెంట్లు చేయటం మామూలే. శివారు ప్రాంతంలో అనేక సంపన్న కాలనీలు ఈ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ వ్యభిచార ముఠాల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నా స్టేషన్ వరకు తెలియదు.

ఎక్కువ సమయం బిజీగా ఉంటూ స్టేషన్‌లో తక్కువ ఉంటూ బయటే పంచాయితీలు సాగిస్తుంటారని ఇక్కడి ఒక అధికారిపై ఆరోపణలున్నాయి. ఇక స్టేషన్ పరిధిలో బార్లు ఎక్కువగా ఉండటంతో కలెక్షన్‌కు లోటుండదు. ఇటీవల ప్రసాదంపాడుకు చెందిన ఒక యువతి ప్రేమ పేరుతో మోసపోయిన ఫిర్యాదులో భారీగా దండుకున్నారనే ఆరోపణలున్నాయి.

కీలక ఘటనల్లో అధికార పార్టీ కలరింగ్ ప్రత్యేకత. రెండు నెలల క్రితం ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య  కేసులో స్కూల్ ప్రిన్సిపాల్‌పై మృతిచెందిన బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ నుంచి భారీ మొత్తం తీసుకొని కేసులో పేరు లేకుండా చేసినట్లు సమాచారం.
 
అధికార పార్టీ  నేతల ఆధిపత్యం
జోన్ పరిధిలోని మూడు స్టేషన్లలో అధికార పార్టీ నేతల అధిపత్యం అధికం. నగరంలోని ఒక ప్రజాప్రతినిధి ప్రత్యేకంగా తన నియోజకవర్గంలో స్టేషన్లకు వచ్చే పంచాయితీలు, అనుకూల ఫిర్యాదుల పష్కారం కోసం ఒక చోటా నేతకు బాధ్యతలు అప్పగిం చారు. ఆ నేత నిత్యం స్టేషన్ల వద్దే ఉంటూ ప్రతి ఫిర్యాదునూ అధికారుల సహకారంతో సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. శివారు ప్రాం తంలో ఉండే స్టేషన్‌లో సదరు అధికార ప్రజాప్రతినిధి హవాకు అడ్డే లేదు. కాల్‌మనీ నిందితుల్ని రక్షించటం మొదలుకొని పేకాట శిబిరాల వరకు అన్నీ ఇక్కడే ఉన్నా పోలీసులకు కనిపించదు.

మరిన్ని వార్తలు