వెలుగులు ఇక నిరంతరం

4 Mar, 2017 22:05 IST|Sakshi
వెలుగులు ఇక నిరంతరం
పాడైన ఎల్‌ఈడీ బల్పుల మార్పునకు ప్రత్యేక కేంద్రాలు 
మండల కేంద్రం సెక్షన్‌ ఆఫీస్‌లో కౌంటర్‌ పెట్టిన ఏపీఈపీడీసీఎల్‌ 
లబ్ధిదారులకు ఉపసమనం 
జిల్లాలో 22.58 లక్షల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ 
మూడేళ్ల వరకు గ్యారెంటీ...
పాడైతే ఎన్నిసార్లయినా మార్చుకునే వెలుసుబాటు
ఆధార్, విద్యుత్‌ బిల్లు తీసుకెళితే చాలు.. 
 
పాడైన ఎల్‌ఈడీ బల్బులను ఇచ్చి కొత్తవి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు లబ్ధిదారులు పాడైన బల్బులను మార్చుకోవాలంటే నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఈసేవలు అందించారు. దీని వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండడంతో శనివారం నుంచి ఆయా మండల కేంద్రాల్లో మార్చుకునే విధంగా విద్యుత్‌ అధికారులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలోని సెక్షన్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. పని వేళల్లో ఎప్పుడైనా లబ్ధిదారులు పాడైన బల్బులను అక్కడ ఇచ్చి కొత్తవి తీసుకొవచ్చు. ఇందుకు పాత బల్బుతోపాటు లబ్ధిదారులు తమ ఆధార్‌ కార్డు, విద్యుత్‌ బిల్లు తీసుకురావాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం డీఈ శ్యాంంబాబు తెలిపారు. - సాక్షి, రాజమహేంద్రవరం
 
రేషన్‌కార్డు ప్రాతిపదికగా బల్బుల పంపిణీ 
గృహ అవసరాలకు సాధారణ బల్బులు వాడడం వల్ల విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. విద్యుత్‌ వాడకంలో మిగులు సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎనర్జీ ఎఫిషిఎన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌), విద్యుత్‌ పంపిణీ సంస్థల భాగస్వామ్యంతో ఎల్‌ఈడీ బల్బులను పింపిణీ చేసింది. రేషన్‌ కార్డు ప్రాతిపదికగా ప్రతి లబ్ధిదారుడుకి రూ.300 విలువైన ఎల్‌ఈడీ బల్బులను రూ.10 చొప్పున ఏపీఈపీడీసీఎల్‌ రెండు బల్బులు పంపిణీ చేసింది. జిల్లాలో 24 లక్షల 40 వేల బల్బులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో 2015 నవంబర్‌ 17న పింపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11,28,732 లబ్ధిదారులకు 22,57,283(93 శాతం) బల్బులును విద్యుత్‌ అధికారులు పంపిణీ చేశారు.
పాడైతే కొత్త బల్బు
మూడేళ్ల గ్యారెంటీతో ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు ప్రతి గ్రామంలో బల్బులను పంపిణీ చేశారు. పగిలిపోవడం కాకుండా పాడైతే ఎప్పడైనా మార్చుకునే వెలుసుబాటు కల్పించారు. అయితే ఇప్పటి వరకు లబ్ధిదారులు బల్బులను మార్చుకునేందుకు నియోజకవర్గ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉండడంతో ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో మరింత ఉన్నతంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రతి మండల కేంద్రంలోని సెక్షన్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. లబ్ధిదారుడు పాడైన తమ ఎల్‌ఈడీ బల్బులను ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు నియోజకవర్గ కేంద్రాల్లో 37,659 బల్బులను పాడైన వాటి స్థానంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మండల కేంద్రాల్లో మార్పిడి కేంద్రాలు పెట్టడం వల్ల వినియోగదారులకు దూరాబారం నుంచి ఉపసమనం కలుగనుంది. 
త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు
పాడైన ఎల్‌ఈడీ బల్బులను మార్చుకునేందుకు ఈఈఎస్‌ఎల్‌ సంస్థతో మండల కేంద్రంలోని సెక్షన్‌ కార్యాలయం వద్ద కౌంటర్లు పెట్టిస్తున్నాం. ఇప్పటి వరకు పలు డివిజన్లలో ఈ ప్రక్రియ ముగిసింది. లబ్ధిదారులు సమాచారం తెలుసుకునేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. పాడైన బల్బుతోపాటు ఆధార్, విద్యుత్‌బిల్లు తీసుకువచ్చి కొత్త బల్బు తీసుకెళ్లవచ్చు. 
- ఎస్‌ఎన్‌ ప్రసాద్, సూపరింటెండెంట్‌ ఇంజనీర్, ఏపీఈపీడీసీఎల్‌
మరిన్ని వార్తలు