బదిలీ టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభం

10 Jul, 2017 23:14 IST|Sakshi
బదిలీ టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభం
  •  ప్రక్రియ ముగిసేదాకా ఎంఈఓలు, హెచ్‌ఎంలకు సెలవుల్లేవ్‌
  •  జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ
  •  

    అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల టీచర్ల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వెరిఫికేషన్‌కు 20 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు.  వివిధ ధ్రువీకరణ పత్రాలు పక్కాగా పరిశీలించాలని ఆదేశించారు.

    ముఖ్యంగా స్పౌజ్, ప్రిపరెన్షియల్‌ కేటగిరీలకు సంబంధించిన వారి విషయాల్లో చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా బాధిత టీచర్లతో పాటు పరిశీలించిన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. తాత్కాలిక సీనియార్టీ జాబితా ప్రకటించిన తర్వాత ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే వాటిని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తామన్నారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ సాగింది. ఇదిలాఉండగా టీచర్ల బదిలీలపై ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని, ఈ ప్రక్రియ ముగిసేదాకా మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సెలవులు ఉండవని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు