చైన్‌స్నాచర్లు దొరికారు

5 Jul, 2016 09:15 IST|Sakshi

అందరూ బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వారే
పథకం ప్రకారం రోజూ దొంగతనం
విచారిస్తున్న పోలీసులు

 
కొంత కాలంగా పోలీసులకు సవాల్‌గా మారిన చైన్‌స్నాచర్లు దొరికిపోయారు.  ముఠా నాయకుడైన ఆ యువకుడికి నిండా22 ఏళ్లు. రెండు పదులు కూడా దాటని యువకులను కలుపుకున్నాడు. సవక చెట్ల నడుమ మద్యం తాగుతూ పథకం రచించాడు. రోజుకో చోట దొంగతనాలు చేశాడు. మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు ఓ మహిళ చెప్పిన ఆధారాలతో పోలీసులు వీరి గుట్టును రట్టు చేశారు.
 
 బుచ్చిరెడ్డిపాళెం : ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి వారి మెడల్లో చైన్లు అపహరించారు. పోలీసులకు దొరకకుండా సవాల్‌గా మారారు. ఓ మహిళ ఇచ్చిన ఆచూకీతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విశ్వసనీయంగా సేకరించిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం పెద్దూరుకు ప్రశాంత్ (22) ఆటో నడుపుకుని జీవనం సాగించేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. 35 ఏళ్లతో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ 30 ఏళ్ల యువతిని వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.

ఆటో నడపడంతో తనకు జరుగుబాటు కాలేదు. దీంతో చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బుచ్చిరెడ్డిపాళెం చెన్నూరు రోడ్డులో ఓ మహిళ చైన్ లాగిన విషయంలో మహిళ అక్కడే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. అయినా అతనిలో మార్పు రాలేదు.  
 
ఏడు నెలలుగా..
చైన్‌స్నాచింగ్‌లకు అలవాటు పడిన ప్రశాంత్ తన ప్రవృత్తిని తన స్వగ్రామంలోనే కొనసాగించాడు. తనతో పాటు అన్నను, మంగళకట్ట, పెద్దూరుకు చెందిన బద్రీ, జయప్రకాష్‌తో పాటు మరికొందరిని కలుపుకున్నారు. మొత్తం ఏడుగురితో బ్యాచ్‌ను తయారు చేశాడు. బద్రీ బేల్దారి పనికి వెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచేవాడు. జయప్రకాష్ డీఎల్‌ఎన్‌ఆర్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయంలో వీరు ఆటో నడిపేవాళ్లు. వీరిని కలుపుకుని ప్రశాంత్ ఏడు నెలలుగా చైన్‌స్నాచింగ్‌లు చేయడం ప్రారంభించాడు.
 
అంతా పథకం ప్రకారమే..
ప్రశాంత్ తన బృందాన్ని తీసుకుని జొన్నవాడ శివారు ప్రాంతాల్లోకి వెళ్లి కూర్చుని దొంగతనాల వ్యూహాలను రచించేవాడు. అక్కడే మద్యం తాగుతూ, బిరియానిలు తింటూ పన్నాగం పన్నేవారు. దాని ప్రకారమే దొంగతనాలు చేసేవారు. ప్రశాంత్ తనతో ఉంటే బృందాన్ని బ్యాచ్‌లుగా విభజించాడు. ఇద్దరు చొప్పున రెండు దొంగతనాలు వేర్వేరు చోట్ల చేసేలా వారికి చెప్పేవాడు. వారు దాని ప్రకారం దొంగతనం చేసి సదరు బంగారాన్ని ప్రశాంత్‌కు ఇచ్చేవాడు.
 
కుటుంబ సభ్యుల ఖాతాల్లో నగదు
ప్రశాంత్ బంగారం అమ్మిన నగదును తన బృందంలోని సభ్యుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో వేసేవాడు. జయప్రకాష్ తల్లి ఖాతాలో ఒకటిన్నర లక్ష ఉన్నట్లు సమాచారం. మిగతా ఖాతాల్లోను నగదు ఉంచాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడు.
 
ఆటోను వదిలి... ఇన్నోవా..
ప్రశాంత్ చైన్‌స్నాచింగ్‌లు బుచ్చిరెడ్డిపాళెంలో చేసే ముందు తన ఆటోను అమ్మేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా జొన్నవాడకు చెందిన ఓ ఆటోను బాడుగకు తీసుకుని నడుపుకుంటున్నాడు. తన ఆటో ఉంటే ఆ నంబర్ల ఆధారంగా తనను పట్టుకుంటారేమోనని జాగ్రత్త పడ్డాడు. బాడుగకు తీసుకున్న ఆటోతో తన సభ్యులను ఉంచి దొంగతనాలు చేశాడు. అయితే దొంగతనాలతో వచ్చిన డబ్బులతో ఏకంగా ఇన్నోవాను కొనేందుకు ప్రశాంత్ సిద్ధమయ్యాడు. తన స్నేహితులతోనే ఇన్నోవాను కొంటున్నానని తెలిపాడు.
 
బయటపడిందిలా...
దగదర్తి మండలం యలమంచిపాడుకు చెందిన పాపమ్మ అనే మహిళ ఒంటరిగా రావడాన్ని ప్రశాంత్, బద్రీ, జయప్రకాష్ గమనించారు. తెలివిగా వారిలో ఒకరు వెళ్లి రాజ్‌కిషోర్ థియేటర్ సమీపంలో నడిచి వస్తున్న ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఒకరు వాహనం నడుపుతుండగా మరో ఇద్దరు ఆమె పక్కన కూర్చున్నారు.

శ్రీహరికోట సమీపంలో రాగానే ఆటోలో కూర్చున్న వ్యక్తులు చైన్ లాగేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయగా ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌గా ఉన్న ప్రశాంత్ బృంద సభ్యుడిని పోలీసులు విచారించగా మొత్తం వివరాలు బయటపడుతున్నాయి. పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు