'దొంగ'భక్తులు వస్తున్నారు..

29 Jul, 2016 08:52 IST|Sakshi
'దొంగ'భక్తులు వస్తున్నారు..

పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల హడావుడి అంతా ఇంతా కాదు. భక్తులు, వ్యాపారులు, పూజారులు, అధికారులు ఇలా అన్ని వర్గాల వారూ పుష్కరాల్లో ఊపిరిసలపనంత బిజీ అవుతారు. వీరే కాదు.. ఇంకో బ్యాచ్ కూడా చాలా బిజీగా ఉంటుంది పుష్కరాల సీజన్‌లో. అదే దొంగల బ్యాచ్. వీరికి కూడా పుష్కరాల్లో చేతి నిండా పనే. వీరి కళ్లన్నీ జనం జేబుల్లోని పర్సులు, నగదు, మహిళల మెడపై ఉండే బంగారు ఆభరణాల చుట్టూనే తిరుగుతుంటాయి. సందట్లో సడేమియా అన్నట్టు దొరికినంత దోచుకునేందుకు వీరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
 
గుంటూరు : విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగల బ్యాచ్ స్థావరాలకు పెట్టింది పేరు. దీన్ని ఆసరాగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు 12 రోజులపాటు జరిగే పుష్కరాల పని కోసం స్థావరాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో తమతో సత్సంబంధాలు ఉండేవారి ద్వారా తమకు ఆశ్రయం కల్పించే వారి తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

తమకు షెల్టర్ ఇచ్చినవారికి అద్దె రూపంలో డబ్బు చెల్లించేలా కాదండోయ్.. వారు కాజేసిన సొమ్ములో కొంత వాటా ఇచ్చేలా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. మొత్తానికి ఈ విషయం ఆనోటా, ఈనోటా పోలీసు బాస్‌ల చెవికి చేరింది. వీరిని ఎలా అరికట్టాలనే దానిపై వారు ప్రణాళికలు రచించే పనిలో పడ్డారు.
 
షెల్టర్లు సిద్ధం!
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలు కానున్న విషయం తెలిసిందే. దీని కోసం వ్యాపారులు, పూజారులు, అధికారులు ఏవిధంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారో దొంగలు సైతం ఈ 12 రోజుల్లో తమ చేతివాటం చూపేందుకు కావాల్సిన ఏర్పాట్లన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
 
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం, మహానాడు, సుందరయ్యనగర్, కేఎల్‌రావు కాలనీతో పాటు, విజయవాడలోని కేదారేశ్వరపేట, రాజారాజేశ్వరిపేట, కొండపల్లి, నందిగామలతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ఉండే దొంగల బ్యాచ్ ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చే దొంగల ముఠాకు షెల్టర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ముఖ్యంగా ప్రకాశం జిల్లా కొప్పరాల తిప్ప, నెల్లూరు జిల్లా పిట్రగుంట, తమిళనాడులోని కాంచీపురం, చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంతో పాటు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అనేక గ్రామాల నుంచి దొంగల ముఠాలు  పుష్కరాల్లో తమ ‘పనితనం’ చూపించేం దుకు సిద్ధమైనట్లు తెలిసింది.
 
దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని తమ పాతమిత్రుల ద్వారా స్థానిక దొంగలను ఆశ్రయించి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. 12 రోజుల పాటు ఇక్కడే ఉండేందుకు వసతి సౌకర్యంతో పాటు, భోజన సదుపాయాలు సైతం అందించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

అందుకు ప్రతిగా వారు దోచుకున్న సొత్తులో కొంత వాటాను వీరికి పంచేలా, వీరి మధ్య సయోధ్య కుదిరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే తాడేపల్లి మండలం పట్టాభిరామయ్య కాలనీలోని ఓ హిజ్రా ఇంట్లో బయటి నుంచి వచ్చే దొంగలకు షెల్టర్ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
 
పుష్కరాల ప్రాంతంలో నిరంతర నిఘా
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాం. గత పుష్కరాల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తతతో వ్యవహరించేలా పోలీసు సిబ్బందికి సూచనలు చేశాం. కృష్ణా పుష్కరాల్లో ఎటువంటి సంఘటనలూ జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.
 - సర్వశ్రేష్ఠ త్రిపాఠి,
గుంటూరు అర్బన్ ఎస్పీ
 
అసలే ముదుర్లు.. వీరికి ఇతరులూ తోడు..
గత కృష్ణా పుష్కరాల్లో సైతం ఈ ప్రాంతంలో దొంగలు తమ చేతికి పనిచెప్పి పుష్కరాలకు వచ్చే భక్తుల సొమ్మును భారీ ఎత్తున దోచుకున్నట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. దీనికి తోడు తాడేపల్లి మండలంలోని అనేక ప్రాంతాలకు చెందిన దొంగలు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలతో పాటు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో సైతం దొంగతనాలు చేసిన సంఘటనలు అందరికీ తెలిసిందే. గత ఏడాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ యోగ సెంటర్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు చెందిన డబ్బు, నగలు, సెల్‌ఫోన్లను తాడేపల్లి దొంగలు ఎత్తుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
 
 అంతా అత్యున్నత స్థాయి అధికారులు కావడంతో దొంగలను పట్టి సొత్తు రికవరీ చేసిన పోలీసులు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో దొంగతనాలకు పాల్పడే దొంగలకు, బయట నుంచి వచ్చే ముఠాలు తోడైతే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించటం కష్టమే. పుష్కర ఏర్పాట్లు, ట్రాఫిక్‌పై దృష్టి పెడుతున్న పోలీసులు వీరిపై ఇప్పటినుంచే పూర్తిస్థాయి నిఘా ఉంచకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనేది అందరూ ఒప్పుకోవాల్సిందే.

మరిన్ని వార్తలు