చలో గరగపర్రు భగ్నం

16 Sep, 2017 22:58 IST|Sakshi
చలో గరగపర్రు భగ్నం
పాలకోడేరు: దళిత సంఘాల చలో గరగపర్రు కార్యక్రమాన్ని పోలీసులు శనివారం భగ్నం చేశారు. గరగపర్రు గ్రామానికి వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు తమ వలయంలోకి తీసుకుని నిర్బంధించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ను గ్రామంలోకి రాకుండా మండలంలోని వేండ్ర రైల్వే గేటు వద్ద అరెస్ట్‌ చేసి భీమవరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాంతో గరగపర్రు గ్రామంలోని దళితులంతా ర్యాలీగా గ్రామ సెంటర్లోకి చేరుకుని నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన ముగ్గురు దళిత యువకులు వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకేశారు. దీంతో ఒక దశలో గ్రామ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒక దశలో ఏమవుతుందో ఏంటో అని అందరూ కంగారు పడ్డారు. డీఎస్పీ పూర్ణచంద్రరావు వస్తున్నారు.. మీతో మాట్లాడతారు వెనక్కి పదండి అని పోలీసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రాంతానికి తీసుకువచ్చారు.   మంత్రులు ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాలని వారు కోరగా అందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని నర్సాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు హామీ ఇచ్చారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న దళిత నేతలతో చర్చించి కొంత మంది ప్రతినిధులు నరసాపురం కార్యాలయానికి వస్తే చర్చించి సమస్య పరిష్కారానికి దారి చూపుతామని హామీ  ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను దళితులు విరమించారు.  ఈ సందర్భంగా కేవీపీఎస్‌ నాయకులు కారుమంచి క్రాంతి, ఎరిచర్ల రాజేష్‌ తదితర దళిత నాయకులు మాట్లాడుతూ డీఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని, ఒకవేళ కాకపోతే 
చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దళితుల చలో గరగపర్రుకు పిలువు ఇవ్వడంతో గరగపర్రు వెళ్లే ప్రతి  వ్యక్తిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వారి గుర్తింపు కార్డులు చూసి నిర్ధారించి గ్రామంలోకి పంపించారు.  
మరిన్ని వార్తలు