అబద్ధాలకు కేరాఫ్‌ చంద్రబాబు

28 Dec, 2016 21:43 IST|Sakshi
అబద్ధాలకు కేరాఫ్‌ చంద్రబాబు
- సీమ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో విఫలం
- ప్రజల కష్టాలు పట్టించుకోని సీఎం
- గడపగడపకు వైఎస్సార్‌లో  అనంత వెంకట్రామిరెడ్డి
 
మంత్రాలయం/పెద్దకడబూరు: అబద్ధాలకు కేరాఫ్‌ సీఎం చంద్రబాబునాయుడేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఇన్‌చార్జి అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దకడబూరు మండల కేంద్రంలో పర్యటించారు. ముఖ్య అతిథులుగా ఆయనతోపాటు ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరయ్యారు. బైకు ర్యాలీ, పూలమాలలతో నాయకులకు ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎస్సీ వాడ నుంచి గడపగడపకు కార్యక్రమం ప్రారంభించారు. చంద్రబాబు పాలన తీరును ప్రజలకు వివరించారు. భారీ జన సందోహం మధ్య ఊరేగింపుగా అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు.
 
         సభలో అనంతవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో వంద అబద్ధపు హామీలు గుప్పించారన్నారు. రాయలసీమ పేరు చెబుతూనే అమరావతి జపం చేస్తున్నారని విమర్శించారు. సీమ ప్రజల కష్టాలను పూర్తిగా విస్మరించారన్నారు. సీమకు పరిశ్రమలు తెస్తామని చెబుతున్నా ఆచరణలో లేకపోయిందన్నారు. సీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటులోనూ తంతు మారలేదన్నారు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శిఃచారు. పూటకోమాట మార్చుతూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఏమి సాధించారని జనచైతన్య యాత్రలు పెట్టారో ఆయన విజ్ఞతకే వదిలేయాలన్నారు. రాయలసీమ పేరు చెప్పుకుని సాగునీటి జలాలను కోస్తాకు తరలిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికే చెల్లిందన్నారు.
 
   ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ.. మామ ఎన్టీఆర్‌ వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుకే దక్కిందన్నారు. చంద్రబాబు పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. ప్రజల అండదండలతో ఎమ్మెల్యేగా గెలిచామని.. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. 
 
విమర్శించే అర్హత నరవకు లేదు : వై.బాలనాగిరెడ్డి
పూటకో పార్టీ మార్చే టీడీపీ నాయకుడు నరవ రమాకాంత్‌రెడ్డికి తమను విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. కనీసం వార్డు మెంబర్‌గా గెలవలేని రమాకాంత్‌రెడ్డికి విమర్శించే స్థాయి లేదన్నారు. పాలకుర్తి తిక్కారెడ్డి.. మూడేళ్లలో నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కనీసం పులికనుమ ప్రాజెక్టుకు రూ.30 కోట్లు అవసరమైనా తేలేకపోయారన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నేత వై.సీతారామిరెడ్డి, పార్టీ రాష్ట్ర యూత్‌ కమిటీ సభ్యులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీ సభ్యుడు మంగమ్మ, లక్ష్మయ్య, ఎంపీపీలు రఘురాముడు, మండల కన్వీనర్లు రామ్మోహన్‌రెడ్డి, భీమిరెడ్డి, మాజీ ఎంపీపీ, సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ హనుమంతురెడ్డి,  జిల్లా కార్యవర్గ సభ్యులు విజయేంద్రరెడ్డి, ఎస్సీసెల్‌ కార్యవర్గ సభ్యుడు తిక్కన్న, నాయకులు బెట్టన గౌడ్, అత్రితనయ గౌడ్, మురళీరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, పంపాపతి, చంద్రశేఖర్‌రెడ్డి, లింగన్న, యల్లప్ప పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు