ఏం ప్రవీణ్‌... ఏమిటీ రచ్చ!

14 Jun, 2017 00:29 IST|Sakshi
ఏం ప్రవీణ్‌... ఏమిటీ రచ్చ!

జిల్లా కలెక్టర్‌కు చంద్రబాబు క్లాసు
భూ కుంభకోణాలపై ఆరా  వాటిపై మాట్లాడవద్దని హుకుం
సాక్షి కథనాలపై చర్చ.. క్లిప్పింగుల పరిశీలన
బహిరంగ విచారణ రద్దు.. సిట్‌ ఏర్పాటు


విశాఖపట్నం : విశాఖలో పుంఖానుపుంఖాలుగా బయటపడుతున్న భూ కుంభకోణాలు ప్రభుత్వ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  దేశం నేతల అండ చూసుకొని అక్రమార్కులు సాగిస్తున్న భూదందాలపై ఆధారాలతో ప్రధాని, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేస్తామన్న అఖిలపక్షం హెచ్చరికలతో ప్రభుత్వ పెద్దలకు వణుకు పుట్టింది. ఈ పరిస్థితుల్లో బహిరంగ విచారణ జరిపితే మరింత రచ్చ అవుతుందన్న భయంతో దాన్ని రద్దు చేసి సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను అమరావతిలోని తన కార్యాలయానికి రావాలని సీఎం ఆదేశించారు. ఉదయం పదిన్నరకే అక్కడికి  చేరుకున్న కలెక్టర్‌.. సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ‘ఏం ప్రవీణ్‌.. విశాఖలో అసలేం జరుగుతోంది.. ఏమిటా రచ్చ.. ట్యాంపరింగ్‌ జరిగిందని ఎందుకు బహిరంగంగా ప్రకటించావ్‌.. ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగే ప్రకటనలు ఎందుకు చేయాల్సి వచ్చింది.. భూములు దోచేసిన వారంతా,. మన పార్టీ వాళ్లేనా.. బయటి వాళ్లు ఎవరూ లేరా... ఇదంతా ఎటుపోతోంది’.. అని చంద్రబాబు కలెక్టర్‌కు క్లాస్‌ పీకినట్టు తెలుస్తోంది.

దానికి కలెక్టర్‌ మౌనం దాల్చారు. భూ కుంభకోణాలపై తన వద్దనున్న పక్కా సమాచారం, ఆయా అక్రమాల్లో టీడీపీ నేతల ప్రమేయంపై ఆధారాలన్నింటినీ బాబుకు  అందించినట్టు తెలిసింది. అదేవిధంగా భూ దందాలపై ఇటీవల సాక్షిలో వచ్చిన వరుస కథనాల క్లిప్పింగ్‌లను కూడా కలెక్టర్‌ బాబుకు అందించినట్టు తెలిసింది. కలెక్టర్‌ ఇచ్చిన ఫైళ్లు, సాక్షి కథనాల క్లిప్పింగ్‌లను నిశితంగా పరిశీలించిన బాబు..‘మన వాళ్ల సంగతి నేను చూస్తా... ముందు అక్కడ రచ్చ కాకుండా చూడండి.. పదే పదే భూ కుంభకోణాలపై మాట్లాడకండి.. మీరు కమిట్‌ అయిన ట్యాంపరింగ్‌పై మాత్రం పక్కాగా విచారణ చేపట్టినట్టు ప్రచారం కల్పించండి.. ఇందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తాను’.. అని బాబు సూచించినట్టు సమాచారం.

కలెక్టర్‌తో చంద్రబాబు సుదీర్ఘ భేటీ అనంతరం.. విశాఖ రూరల్‌ మండలంలోని కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూ వివాదాలు, రికార్డుల ట్యాంపరింగ్‌లపై సిట్‌తో దర్యాప్తు  చేయనున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. సిట్‌లో సభ్యుల పేర్లను ఇంకా ఖరారు చేయని ప్రభుత్వం.. ఆ బృందంలో రెవెన్యూ, పోలీసు,. న్యాయాధికారులు ఉంటారని పేర్కొంది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు